పోవు సర్వశక్తుడాయన నిన్ను వధించకపోడు. జాగ్రత్త అంటుంది. ఈ మాటల్లో అంతరార్ధమా దానవుడికి తెలియవచ్చు తెలియకా పోవచ్చు. అది వేరే విషయం.
పోతే చివర రావణ వధానంతరం రాముడు తన్ను అనుమానించి నానా మాటలన్నప్పుడందరి ఎదటా ఆవిడ ఇచ్చిన సమాధానం వింటే తెలుస్తుందమ్మ వారి ప్రాభవమెలాంటిదో. ప్రాకృతః ప్రాకృతామివ. ఒక పామరుడైన మగవాడొక పామర స్త్రీని అన్నట్టు అంటావేమిటి ? నిజానికి ఇద్దరూ ప్రాకృతులు కారు. అప్రాకృత స్వరూపులే. నతథ్మాస్మి యథాత్వం మామవగచ్చసి. నీవు భావిస్తున్నట్టు నేను లేను సుమా. నిజమే మనం భావించినట్టు లేదా దేవత. ఎలా ఉండాలో అలాగే ఉందా తత్త్వం. పైగా నా శరీరంవాడు స్పృశించాడంటే అది నా చేతిలో లేదు. నా చేతిలో ఉన్నది నా హృదయం. అది నీకే అధీనం. నిజమే. అమ్మ స్థూలరూపమెవరికైనా గోచరమయ్యేదే. సూక్ష్మమైన అవ్యక్తమైన రూపమెవరికీ గోచరం కాదు. అది పరమాత్మకే అంకితం. అపదేశేన జనకాతో - నోత్పత్తి ర్వసుధాతలాత్ నా జన్మ జనకుడివల్లా కాదు. వసుధవల్లా కాదు. అది కేవలమొక అపదేశం. నీకు నా వృత్తాంత మసలంతు పట్టలేదు. క్రోధం తప్ప నీవేదీ ఎరుగవు. లఘునేవ మనుష్యేణ స్త్రీత్వమేవ పురస్కృతమ్. ఒక తేలిక మనిషిలాగా ఆడదాని స్వభావమే కనపరుస్తున్నావు. ఎంత ఘాటుగా మాట్లాడగలదో చూడండి సీత. మాట్లాడటమే గాదు. చితామ్మే కురు సౌమిత్రి వ్యసనస్యాస్యభేషజమ్. చితి పేర్చు లక్ష్మణా ఈ కలిగిన వ్యసనాని కౌషధమదే నంటుంది. అగ్నిలో ఒకరు ప్రవేశించమని చెప్పనక్కరలేదు. స్వయంగానే ప్రవేశిస్తానంటున్నది. ఆమె కేమిటి భయం. ఆవిడ ఎవరసలు. చిదగ్ని కుండ సంభూత గదా. మళ్లీ ప్రవేశిస్తే మాత్రమేమవుతుంది. ఆ అగ్నిహోత్రుడే భయపడి బయట పెడతాడు. భౌతికమైన అగ్నిగదా అది ఏమి చేయగలదు. మరి ఎందుకు బయట పెట్టటం. అప్పుడే ఆవిడ తన రూపాన్ని ఉపసంహరిస్తే ఎలాగా ? ఇంకా దానితో ఆ తల్లి సాధించవలసిన కార్యం చాలా ఉంది. దేవకార్యమక్కడికి ముగిసినా ఇంకా పతిదేవ కార్యముంది కొంత. అది ఆయనద్వారా ఈ మానవ లోకాని కందజేయ వలసిన రాజవంశ సంతానం. వారే కుశలవులు, వారికి వాల్మీకి లాంటి మహామునుల శిక్షణ కావాలి. అందుకు తాను వారి ఆశ్రమం చేరాలి. దానికి లోకాపవాదం దారితీయాలి. అలాగే తీసింది. లేకుంటే లంకలో అంతమంది ఎదుట పరిశుద్ధ
Page 278