#


Index



సీతా మందోదరులు

హరించదు. పాపం దీని చర్మంమీద ఉపవేక్ష్యతివై దేహీ మయా సహ సుమధ్యమా సీత నాతో కలిసి కూర్చుంటుందట. వెళ్లి తెస్తానని అంటాడు. ఏమి మాటలో చూడండి. ఈ మాటలు వింటుంటే అమ్మవారి నాటకానికి తగినట్టే ఉంది అయ్యగారి నాటకం కూడా. ఆయనకా ప్రేరణ కలిగించిందా మహాశక్తే. ఎలాగో ఆయనను వదిలించుకొన్నది. మరి లక్ష్మణుణ్ణి ఎలా వదిలించుకోవటం. ఒకరాగాన వదలడా మరిది. అయితే ఏ మాటంటే వదలిపోతాడో తెలుసావిడకు. అలాంటి మాటే అన్నది చివరకు. దానితో నసాళమంటి ఆ మహాత్ముడు కూడా వదలిపోయాడు. పైగా అన్ని మాటలు అని పంపించిన మనిషి తరువాత హనుమంతుడితో భ్రాతురాదేశ మాదాయ లక్ష్మణోవాపరం తపః కస్యహేతోర్నమాం వీర పరిత్రా తిమహాబలః. అన్న ఆజ్ఞను తలదాల్చి ఆ లక్ష్మణుడైనా వచ్చి నన్ను కాపాడవచ్చు గదా. ఎందుకు కాపాడడు అని వాపోతుంది. ఎంత చిత్రమో చూడండి అమ్మ చరిత్ర.

  అమ్మ ప్రణాళికా మార్గంలో నాల్గవ మజిలీ ఆవిడ రావణుడితో కలిసి వెళ్లుతూ అంత హడావుడిలో కూడా తన ఉత్తరీయంలో ఆభరణాలన్నీ పెట్టి ఒక మూట గట్టి ఋశ్యమూకం మీద ఉన్న సుగ్రీవాది వానరుల ముందు పడవేయటం. ఇది చాలా చిత్రమైన విషయం. ఒళ్లంతా కళ్లు చేసుకొని చూచే రావణుడది కనిపెట్టలేదా ? అంత వేగంతో పోతున్న విమానంలో నుంచి పడవేస్తే సరిగా ఆ కొండమీద ఉండే సుగ్రీవాదుల ముందే పడిందా అది. ఏమిటీ చమత్కారం. చమత్కారమే మరి. మహాశక్తి చేసే ప్రతిపనీ చమత్కారమే. భవిష్యదర సూచకమే. రామలక్ష్మణు లక్కడికే వస్తారని వారితోనే సఖ్యం చేస్తారనీ అంతా కలిసి లంకకు వస్తారని యుద్ధంలో రావణాదులను సంహరించి ఎలాగూ తన్ను విడిపిస్తారనీ ముందుగానే తెలుసునా త్రిపురసుందరికి. కనుకనే నేమో ద్రక్ష్యే తదార్యా వదనమ్ కదాన్వహ మ్మని ఆ సుందర ముఖారవిందాన్ని చూడాలని ఉబలాటంతో బయలుదేరాడు ఆంజనేయుడు. రావణుణ్ణి బెదరించటంలో కూడా నాహ మేవయికీ భార్యా పరభార్యా సతీతవ. నేను సతిని సదాఖ్య దేవతను. పరాత్పరుడి భార్యను. నీకు చక్కేదానను కాను. నీవు నన్ను భరించలేవు. చోరుడిలాగా అపహరించి తెచ్చావేగాని ధీరుడిలాగా తేలేదు నన్ను నీవు. వామాచారుడికి వశమయ్యే దానను కాను నేను. నీవెంత నన్ను నిర్బంధంలో పెట్టినా దీర్ఘబాహుర్విశాలక్షాః నా నాథుడు సర్వజ్ఞుడాయన కంటబడక

Page 277

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు