#


Index



సీతా మందోదరులు

నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య. నా జీవితమైనా నిన్నైనా లక్ష్మణుల్లైనా వదులుకోగలను గాని ఆర్తులకు మాట ఇచ్చి మాత్రం వదులుకోలేను సీతా. మమస్నేహాచ్ఛ సౌహార్దాదిద ముక్తం త్వయానఘే. నా మీద స్నేహంతో సౌహార్ధంతో చెప్పావీమాట నీవు. సంతోషం నహ్యనిష్టోను శిష్యతే. ఇష్టమున్న వారికేగదా ఎవరైనా సలహా ఇస్తారు. సహధర్మచారిణీ మేత్వం ప్రాణేభ్యోపి గరీయసీ. నీవు నాకు సహధర్మచారిణివి. ప్రాణాధికవు అంటాడు. ఇక్కడ నిన్నైనా వదులుకోగలనని చెప్పటం భావ్యర్థ సూచన. అంతేకాదు. వదులుకోగల నంటూనే మరలా ప్రాణాధిక వంటున్నాడు రాముడు. ప్రాణాధిక అయితే ఎలా వదులుకోగలడు. అంటే భౌతికంగా వదలినట్టు లోకులకు భాసించినా ఆత్మీయంగా ఎప్పుడూ అవినాభావంగానే ఉన్నదా శక్తి. అది తనకు సహచారిణే. ఎలా వదిలిపోతుంది. తనచేత రాక్షస సంహారం చేయించవలసింది ఆ శక్తియే కదా. అయినా తన్ను ఎందుకిలా నిరుత్సాహ పరుస్తున్నది. నిరుత్సాహపరచటం కాదిది. దుష్ట శిక్షణోద్యమంలో ఆయనకెంత పట్టుదల ఉందో పరీక్షించటానికి. కనుకనే ఆ మాట ఆయన అన్న తరువాత ఇక మారుమాట ఏదీ మాట్లాడలేదు సీత. అంటే తన అభిప్రాయం చక్కగా గ్రహించాడని మనసులోనే సంతోషించి మౌనం. వహించిందన్న మాట.

  అమ్మవారు ఏది సంకల్పించినా, ఏది మాట్లాడినా, ఏది చేసినా ప్రతి కదలికలో ఏదో నిగూఢమైన రహస్యం దాగి ఉంటుంది. ఏదో కాదది. ముందు పేర్కొన్నట్టు దుష్టజన నిగ్రహము, తద్ద్వారా శిష్టజనానుగ్రహము. రావణాది రాక్షసగణ ప్రమాపణానికామె ఎన్ని పోకడలు పోవాలో అన్నీ పోయింది. అందులకు నాందీ ఆవిడ భర్తను అదిరించి బెదిరించి ఆయన వెంబడి కానన భూములకు వచ్చి కాపురముండటమే. రాక్షసులను పరిమార్చి సాధు జన రక్షణ చేసే సామర్ధ్యము దీక్షా ఆయనకున్నవా లేవా ? అని పరీక్ష పెట్టటం రెండవది. పోతే మూడవది. మాయామృగ గ్రహణ ప్రలోభము, దానిని పట్టి తెమ్మని భర్తను నిర్బంధించటము, ఏమైనా పనేనా ఇది. ఒక మాయలేడి తన ముందు పారాడటమేమిటి ? దాని మీద తాను వ్యామోహపడటమేమిటి ? అది ఎలాగైనా తనకు తెచ్చి ఇవ్వమని భర్తను దాని వెంట తరమటమేమిటి ? అంతకుముందే తెలుసు తమకందరికీ ఆ దండకారణ్యమంతా రాక్షసుల మాయలకు నిలయమని, కామరూపులైన ఆ

Page 275

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు