#


Index

సీతా మందోదరులు

  పోతే అక్కడ అరణ్యాలలోనైనా ఊరక ఉండనిచ్చిందా ఆ మహానుభావుణ్ణి. ఊంకుంటే రాక్షస సంహారమెలాగా ? దానికి తగిన సన్నాహమంతా చూపాలి మరి. ఏమిటది. అక్కడి మహర్షులను ఖరదూషణాది రాక్షసులు బాధించాలి. వారంతా వచ్చి తన భర్తను శరణువేడాలి. వేడితే వారి నాదుకోటాని కాయన ఎలాగూ ఆ దానవులతో యుద్ధం చేయక తప్పదు. ఇదంతా తన కభిమతమే. అయినా తనకేమీ తెలియనట్టు అమాయికత్వం నటిస్టూ మనం తాపనులం గదా తపస్వులు వచ్చి మిమ్ము అర్థిస్తే అర్ధించవచ్చు. అయినా కథంచన నసాకార్యా - గృహీత ధనుషాత్వయాబుద్ధి ర్వైరం వినా హంతుం రాక్షసాన్ దండ కాశ్రితాన్ - అపరాధం వినా హంతుం లోకాన్ వీరన కామయే. దండకారణ్యంలో ఉండే రాక్షసులు మనకేమి అపకారం చేశారు. వారితో మనకేమిటి వైరం. వైరం లేకుండా వారిని వధించటమేమి ధర్మం. నిరపరాధులను శిక్షించటం నాకిష్టంలేదు. క్వచశస్త్రం, క్వచవనం, క్వచక్షాత్రం, తపఃక్వచ. అసలు వనవాసమేమిటి ? శస్త్రధారణ మేమిటి ? తపస్సేమిటి ? క్షాత్రమేమిటి ? ఒకదాని కొకటి సరిపడే వ్యవహారమేనా అని ఆక్షేపిస్తుంది. చూడండి. దండకారణ్యవాసులైన రాక్షసులు నిరపరాధులట. వారితో తమకు వైరం లేదట. వారిని శిక్షించటం తనకిష్టం లేదట. అసలు అందుకోసం కాదట తామక్కడికి వచ్చింది. తపశ్చర్యకోసమట. ఇదేమైనా నమ్మదగిన మాటేనా ? అంతకు ముందే ఖరదూషణాదుల బాధలు పడలేక వచ్చి మొరపెట్టుకొన్నారు తాపసులు. వారిని రక్షిస్తానని హామీ ఇచ్చాడు తన నాథుడు. వారటు వెళ్లారో లేదో విరాధుడనే రాక్షసుడివల్ల ఉపద్రవం తమకు ఏర్పడనే ఏర్పడ్డది. ఎలాగో బయటపడ్డారు వారి బారినుండి తాము. ఇంత జరిగినా రాక్షసులు నిరపరాధులేనట. వారిని చంపటానికి శస్త్ర ప్రహరణాదులు ధరించనక్కర లేదట. అక్కరలేదని ఇప్పుడా తెలిసింది తనకు. అయోధ్య నుంచి బయలుదేరి వచ్చేటపుడే చూచింది గదా రాముడు శస్త్రాస్త్రాలు ధరించి రావటం. ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పవచ్చుగా వాటిని పట్టణంలోనే పెట్టి రమ్మని. మరి ఇంతదూరం మోసుకొని వచ్చిన తరువాత చెప్పటం దేనికి. ఇదంతా వట్టిమాట. తనకిష్టంలేక కాదు. భర్త తన మాటకేమి బదులు చెబుతాడో చూతామని.

  ఆయన ఏమి తక్కువవాడు కాదుగదా. ఆవిడ మాటకు తగినట్టుగానే ఉందాయన జవాబు. అప్యహం జీవితం జహ్యం - త్వాంవా సీతే సలక్ష్మణామ్

Page 274

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు