#


Index

సీతా మందోదరులు

అమాయకంగా నిన్ను మహావీరుడని కీర్తిస్తున్నది. చూడండి ఈ మాటలు. ఎలాంటి మాటలంటే భర్తకు పౌరుషం వస్తుందో ఆవిడకు బాగా తెలుసు. ఆయన కెలాగైనా పౌరుషం తెప్పించి పంతానికైనా తన్ను తీసుకెళ్లాలని ఆవిడ ఎత్తుగడ. అయితే రాముడేనా తక్కువ తిన్నది. పరమాత్మ గదా. ఆయన కామాత్రం తెలియదా తన మాయశక్తి ఎత్తుగడ. అది మాయ అయితే తాను మాయావి. అందుకే అంటున్నాడు. తవ సర్వ మభిప్రాయ మవిజ్ఞాయ శుభాననే వాసం నరోచయే రణ్యేశక్తి మానపి రక్షిణే. నాకు భయంలేదు. పాడూలేదు. అరణ్యాలలో నిన్నుకాపాడలేనని కాదు. నేను సర్వ సమర్ధుణ్ణి అయినా నీ అభిప్రాయమేమిటో ఎలా ఉందో తెలుసుకోకుండా తీసుకెళ్లటమేమి బాగు అని అలా అన్నాను అంటాడు. చూడండి ఈయనగారి దెంత మోసమో. అంతేకాదు. యత్సృష్టాసి మయా సార్ధం వనవాసాయ మైథిలి నవిహాతుం మయా శక్త్యా కీర్తి రాత్మవతా యథా. నీవు నాతో వనవాసం చేయటానికే సృష్టి అయినావు. నిన్ను వదిలి నేనెలా వెళ్లగలను. తన కీర్తిని తాను వదులకోగలడా ఎవడైనా చూడండి. కీర్తిలాంటిదట ఆవిడ. అప్పటి కావిడను వదిలితే కీర్తిని వదలినట్టే గదా. కీర్తిని వదులుకోగలడా రాముడిలాంటి ఉదాత్త పురుషుడు. అంటే వదులుకొనే ఉద్దేశం తనకూ లేదప్పటికి. పైగా అనుగచ్చ స్వమాంభీరు. సహ ధర్మచారిణిని కమ్మంటాడు. ఈవిడ నీకు సహధర్మచరి అవుతుంది. అలాగే చూచుకోమని గదా వివాహ సమయంలో ఆవిడ తండ్రి తన కొప్పగించాడు. చూడండి. అదే మాట మరలా తనూ అంటున్నాడిప్పుడు. ఇలాంటి అభిప్రాయం తనకున్నప్పుడావిడను రావద్దని ఎలా నివారించాడు. నివారించటమా పెట్టటమా? తానే అన్నాడుగా ఆవిడ ఆంతర్యమేమిటో తెలుసుకొందామని. ఆవిడ అంతకన్నా ధూర్త గనుకనే అరణ్యవాసం చేస్తావని తన జాతకంలో వ్రాసి ఉన్నట్టుగా నాటకమాడింది. అలాగేకానీ వ్రాసి ఉంటే తప్పుతుందా. నేను మాత్రం నా కీర్తిని విడిచిఉండగలనా ? సహధర్మచారిణివి గదా. అలాగేచరించమని ఆయన ఒక పెద్ద నాటకమాడాడు. ఇంతకూ ఇద్దరికీ పట్టాభిషేకం భంగమైందని లేదు. పట్టణంలో ఉండాలని లేదు. ఎలాగైనా ఉచ్చులు తెంచుకొని బయటపడాలనే ఇద్దరి పన్నాగమూ అందుకు ముందంజ వేసింది అమ్మవారే. లేకుంటే కూటస్థుడైన పరమాత్మకు చలనమేలేదు కదా. కదలికలేని ఆయనను కదిలించి తీసుకెళ్లింది అరణ్యానికి, కైక మంథర అనేవారు, కటాక్ష కింకరీభూత అన్నట్టు కేవల మాదేవి కటాక్ష బలంతో దోహదం చేసినవారే.

Page 273

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు