#


Index

సీతా మందోదరులు

ఆ దేవతకు. పైగా ఆటగాడట తన భర్త. నిజమాటకాడే గదా పరమాత్మ. ఒక ఆటగాడి లాగానే ఎన్నో వేషాలు వేసుకొని కనిపిస్తాడు. తన శక్తి నా వేషాలకు పంచిపెడతాడు. అయినా అది ఆ నామరూప బంధంలో ఉన్నట్టు భాసించినా అందులో లేదు వాస్తవానికి. అది ఉన్నది తనలోనే. అసలది తనలో లేకుంటే తనకే లేదసలు అస్తిత్వం - గతిశక్తి ఏదో స్థితి శక్తి కూడా అదే. శివశ్శక్త్యా యుక్తో యది అన్నట్టు అది ఉంటేనే తనకు నిలకడా ? కదలికా ? లేకుంటే దేనికీ నోచుకోలేడు తాను. తాను సత్యవంతుడే కావచ్చు. అయినా ద్యుమత్సేన సుతుడై కూర్చున్నాడు. ద్యుమత్సేన ఈ త్రిగుణాత్మకమైన సంసారమే. దీని సంపర్కంతో పుట్టాడు తాను. అదే దశరథ సుతుడుగా సంక్రమించిన మనుష్యభావం. దానిని మృత్యురూపమైన తమస్సులో పడకుండా తప్పించి తన శుద్ధ సత్త్వోపాధిని కాపాడాలంటే తేజోరూపిణి అయిన సావిత్రి తానే కరావలంబ మివ్వాలి. అది ఈ భవారణ్యంలో ఒంటరిగా తిరుగుతూ ఎక్కడ కోలుపోతాడో ఆ సత్యవంతు డందుకోసం తాను ఆయనను అనుక్షణము వెంబడిస్తూనే ఉండాలి తప్పదు. అది ఇంతకుముందే చెప్పారట జ్యోతిషికులు. ఈవిడ ఇకమీదట అరణ్యాలలోనే నివసిస్తుందని. అప్పటి నుంచి తనకది ఎంతో ఇష్టమట. జ్యోతిషికులెవరు చెప్పడానికి. జ్యోతిషికులనేది ఒక నెపం. కాలస్వరూపిణి తానే. తనకు తెలియకపోతే గదా. తానే వేసుకొన్నది ప్రణాళిక. ఏమిటది. సకల రాక్షస విధ్వంసనం. ఏమిటా రాక్షస శక్తులు. రాజస తామస భావాలే. ఎక్కడ ఉన్నాయవి. ఈ సంసారారణ్యంలోనే. వాటిని నిర్మూలించటానికే పరమాత్మ ఇప్పుడరణ్యాలకు వెళ్లుతున్నాడు. మరి ఆ పరమాత్మ శక్తి అయిన తాను ఇంట్లో కూర్చుంటే ఎలా ? ఆయన ననుసరించే వెళ్లాలి. అతని ఉద్యమానికి తాను చేయూతనివ్వాలి. అతడు వద్దన్నా తాను మానరాదు.

  అయినా వద్దని వారించాడు రాముడు. ఇంత నచ్చజెప్పినా వద్దంటాడా అని ఆగ్రహించింది అమ్మవారు. ఒక మంచి చురక పెట్టి చూతామనుకొంది. కింత్వా మన్యత వైదేహః-పితామే మిధిలాధిపః రామజామాతరం ప్రాప్య - స్త్రియం పురుష విగ్రహమ్. రామా నిన్ను పురుష రూపంలో ఉన్న స్త్రీవని తెలియక మా తండ్రి జనకుడు నన్ను నీకిచ్చి మోసపోయాడు. అసలు నీలో మగతనంగాని, పౌరుషంగాని ఉన్నదంటావా ? అనృతం బత లోకోయమ జ్ఞానాద్యద్ధి వక్ష్యతి ఈ లోకానికి తెలియక

Page 272

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు