#


Index

సీతా మందోదరులు

  రాముడు నాతో రానక్కరలేదు. నీవు అత్త మామలను సేవిస్తూ ఇక్కడ ఉండమని బోధిస్తే శైలూష ఇవ మాం రామ - పరేభ్యోదాతు మిచ్చసి. ఒక ఆటగాడి మాదిరి నన్ను నీవు ఇతరుల కప్పగించి పోవాలనుకొన్నావా ? విషమ ద్యైవ పాస్యామి మావేశం ద్విషతాం వశమ్. విషమైనా త్రాగి చస్తానుగాని విరోధుల అధీనంలో నేనుండను సుమా. కింహికృత్యా విషణ్ణస్త్వం మామనన్య పరాయణామ్. అసలు నీవెందుకు భయపడుతున్నావు. బాధపడుతున్నావు. నీవు తప్ప అన్యుల నెరుగని నన్ను వదలిపోవాలని చూస్తున్నావు ఏమి కారణం. నేనెవరనుకొన్నావో నీవు. ద్యుమత్సేనసుతం వీర - సత్యవంత మనువ్రతామ్ - సావిత్రీ మివమాం విద్ధి -త్వమాత్మ వశవర్తి నీమ్ ద్యుమత్సేన కుమారుడైన సత్యవంతుని ఎడబాయని సావిత్రియే నేనని భావించు. నాహం శక్త్యా మహాభాగ నివర్త యతు ముద్యమాత్. నన్ను నా ఉద్యమం నుంచి నీవు మళ్లించలేవు. సుఖంవనే నివత్స్యామి యధైవ భవనేపితుః భవనంలో లాగే వనంలో కూడా సుఖంగా ఉండగలను. త్వంహికర్తుంవనే శక్తి రామ సంపరి పాలనమ్. కాకపోయినా నీవున్నావు గదా నన్ను కాపాడటానికి. ఇచ్ఛామి సరితః శైలాన్పల్వలాని వనానిచ ద్రష్టుమ్. నాకెప్పుడూ అరణ్యాలు, పర్వతాలు, పల్వలాదులు చూడాలని చాలా ఇష్టం. అసలు నీకొక సంగతి తెలుసునో లేదో ? పురాపితృ గృహే సత్యం - బ్రాహ్మణానాం మయాశ్రుతం - వస్తవ్యం కిలమే వనే. నేను మా తండ్రి గారింట్లో ఉండగా దైవజ్ఞులైన బ్రాహ్మణులు కొందరు ముందే చెప్పారు నేను అరణ్యాలలోనే చాలా కాలముంటానని. వారి మాట విన్నప్పటి నుంచి వనవాస కృతోత్సాహ-నిత్యమేవ మహాబల ఎప్పుడెప్పుడు వనవాసం చేస్తానా అని నిత్యము కుతూహలపడుతుంటాను నేను.

  ఇవి సీత రాముడితో అన్న మాటలు. ఈ మాటలేవో పైకి లోక సామాన్యంగా చెప్పినట్టున్నా ఇందులో ఎన్నెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో చూడండి. ఆవిడ మహాశక్తి గనుకనే రామబ్రహ్మాన్ని విడిచి ఉండలేదు. ఆయన కావిడ నిత్యానపాయిని. భవనంలోనైనా వనంలోనైనా ఆయనతోనే లోకం. భవనం స్వరూపావస్థ అయితే వనమనేది ఇక్కడ విభూత్యవస్థ. రెండు దశల్లో శివ శక్తులకు సామరస్యమే. దానికి భిన్నంగా తన శక్తి నాయన వదులుకోవటానికి గాని ఇతరుల కప్పగించటానికి గాని వీలులేదు. ఆత్మ చైతన్యాని కితరమే లేదు. ఇతరమనే భావమెప్పుడూ పరిహరణీయమే

Page 271

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు