దానితో ద్విగుణీకృత పరాక్రముడయ్యాడు రాముడు. ఆయన ఇక ఊరక పట్టాభి రాముడై కూర్చుంటే ప్రయోజనం లేదు. ఆయన గారి అవతార ప్రయోజనం రాక్షస సంహారం. ముఖ్యంగా రావణ సంహారం. అదే తనకు కావలసింది. ఆయనచేత చేయించాలది. అందుకోసం ఈర్ష్యా మాత్సర్య రూపాన్ని ధరించి మంథరా కైకేయీలలో ప్రవేశించింది. అంతవరకూ లేని దుర్బుద్ధి పుట్టించి భర్త వనవాసానికి దారి తీయించింది. కదంబ వనవాసిని గదా. వనవాసమంటే తనకూ ఇష్టమే. కనుక తానూ బయలుదేరిందాయనతో. శక్తి స్వరూపిణి తాను ప్రక్కన ఉంటేనే గదా ఏ రాక్షస సంహారమైనా. అది ఆయన పట్టణంలోనే కూర్చున్నా సాధ్యం కాదు. లేక అరణ్యాలకు తాను లేకుండా వెళ్లినా సంభవం కాదు. అది తన అంతరాత్మకు తెలిసి కూడా ఆవిడ ఏమంటుందో చూతామని వనగమనాన్ని వారించాడు రాముడు. అయితే వారించినంత మాత్రాన ఊరకుంటుందా ఆవిడ. ఊరకుండటానికా వచ్చిందసలు. ఊరకుంటే పని ఎలా జరుగుతుంది. చూడండి. పెండ్లి అయినప్పటి నుంచీ ఆ క్షణందాకా పెదవి విప్పి ఒక్కపలుకైనా ఆడని ఆ ఇల్లాలు ఒక్కసారిగా విఱుచుకు పడ్డట్టు ఎంత దీర్ఘమైన చర్చ చేసిందో తన భర్తతో.
రాముడు తన పట్టాభిషేక వృత్తాంతం తల్లితో తప్ప ఆవిడతో చెప్పలేదు. తరువాత అది భంగమైన వార్త కూడా మొదట తల్లితోనే చెప్పాడాయన. ఆ పిమ్మటనే సీత దగ్గర ప్రస్తావించింది. అభిషేకం జరుగుతుందని సంతోషము లేదావిడకు జరగకుండా నిలిచిపోయిందనే విషాదము లేదు. అవి రెండూ కలిగింది అత్తగారైన కౌసల్యకే. ఆవిడకు గాదు. చూడబోతే ఆవిడకు కావలసింది పట్టాభిషేకం జరగటమా, మానటమా అని కాదు. రాముడరణ్యానికి వెళ్లితే తానూ ఆయన ననుసరించి వెళ్లట మొక్కటే. ఆ విషయంలో మాత్రమెవరడ్డు చెప్పిన ఒప్పుకోదామె. అత్త మామలే కాదు వారి మాట అలా ఉంచి తన పెనిమిటి కాదన్నా సహించదు. పెనిమిటికి జరగవలసిన మిగతా వేడుకలూ, వినోదాలూ ఏవీ పట్టనట్టు కేవలం ఆయనతోఅరణ్య గమనం చేయటం మాత్రమే తనకు కావలసినట్టుగా కనపడుతుంది. కనపడట మేమిటి. ఆ మాటకు వస్తే అసలు తానందుకోసమే జన్మించానని కూడా చెబుతుంది రాముడితో.
Page 270