అయోధ్యకు తీసుకొనిపోయి తండ్రి కప్పగించవచ్చు. అలా చేయక మిథిలకు వచ్చాడు. రాముడికి విషయం చెప్పకుండానే వెంట తెచ్చాడు. అంటే ఏమని అర్ధం. అతడే ఆ పని సాధిస్తాడని సీతను పెండ్లాడతాడని ధైర్యముండటం వల్లనే గదా ! ఇదుగో ఆ మహర్షి మస్తిష్కంలో ఈ ఆలోచనా తరంగం రేకెత్తించిందీ ఆ మహాశక్తే. ఆ మహాశక్తి ఎవరోగాదు గాయత్రే గదా. మరి గాయత్రీ మంత్ర ద్రష్ట విశ్వామిత్రుడే అయినప్పుడు ధియో యోనః ప్రచోదయాత్తని ఇతరులకంటే ముందుగా ఆయనకే గదా అది ధీప్రచోదన చేయవలసింది. అలాగే చేసి ఆయనను రామసహితంగా రప్పించింది మిథిలకు.
జనకుడర్ఘ్య పాద్యాలతో సత్కరించి తమ ఆగమన ప్రయోజనమేమని అడిగితే వీరు నీ దగ్గర ఉన్న శివధనుస్సు చూడటానికి వచ్చారు. వీరికా ధనుస్సు చూపు. కృతకాములై వెళ్లుతారంటాడాయన. ధనుస్సు కోసమే వచ్చాడట రాముడు. అది చూపితే చాలు. అతని కోరిక తీరుతుందట. కామమంటే కోరికే. ఈ కామం రాముడిది కాదు. అమ్మవారిది. కామేశ్వరి గదా ఆవిడ. తాను కామేశ్వరి అయి నిష్కాముడైన తన నాథుణ్ణి సకాముడుగా చేసిందావిడ. అందుకే ద్రష్టు కామౌ ధనుః శ్రేష్ఠమ్. ధనుర్దర్శన కామంతో వచ్చాడాయన. అలా వస్తే ఇక ఎంతసేపు. అమ్మవారి అపాంగ వీక్షణమే చాలు. ధనుస్సు ఎత్తటమూ, ఎక్కుపెట్టటమూ, లాగటమూ, విడవటమూ అంతా ఒక్కక్షణం పట్టదు. భగవన్ దృష్ట వీర్యోమే రామో దశరథాత్మజః అత్యద్భుత మచింత్యంచ నతర్కిత మిదం మయా అన్నజనకుడి ఆలోచనకు తట్టకపోవచ్చు. కాని ఆ దేవికది ఎప్పుడో తెలుసు. అలా జరుగుతుందని జరగాలని. తెలిసే గదా వేదవతి సీతగా జన్మించింది. జన్మించింది రాముడి కోసమే అయినప్పు డాయనను చెట్టపట్టాలి గదా. ఆ పట్టణం రావణ సంహారం కోసమే అయినప్పుడాయన పరాక్రమం లోకానికి దృష్టం కావాలిగదా. అందుకే దనుర్భంగం ద్వారా ఆయనను దృష్టవీర్యుణ్ణి చేసింది. తాను వీర్యశుల్క అనిపించింది. పోతే వివాహానంతరం అయోధ్యకు తరలి వెళ్లుతూ దారిలో క్రోధ భట్టారికగా మారి పరశురాముణ్ణి ఆవేశించి ఆయన చేతిలో ఉన్న ఆ ఒక్క వైష్ణవ చాపాన్ని కూడా ఊడలాగి తన పెనిమిటి చేతి కందిచ్చింది.
Page 269