#


Index


కవి మాహాత్మ్యము

ఋషివాక్కు కాబట్టి భావ్యర్ధాన్ని ధ్వనింపజేయటం కూడా సమంజసమే. దుష్టశిక్షణ, శిష్టరక్షణ మూలంగా ధర్మసంస్థాపన చేయాలన్న అవతార ప్రయోజనమూ, అందులోనూ రామావతారం కావించిన విశిష్టధర్మ ప్రతిష్ఠాపనమూ ఇందులో మనకు బహురమణీయంగా ప్రతీయమానమవుతున్నది.

  అంతేకాదు. మరికొంత లోతుకు దిగి భావనచేస్తే మనమింకా ఒక ఆధ్యాత్మికమైన అర్థం చెప్పుకొన్నా తప్పులేదనిపిస్తుంది. ముందు చెప్పింది దేవుణ్ణి సంబోధించి. ఇప్పుడు చెప్పేది జీవుణ్ణి సంబోధించి అది ఎలాగంటే మానిషాద, మాయాశక్తి కధీనమై అందులోనే వసించే జీవుడా. త్వమ్ నీవు త్వమ్ పదవాచ్యార్థమైన జీవుడవైననీవు సద్గురూపదేశం మూలంగా. మానిషాద ప్రతిష్ఠామ్, మాయాతీతుడైన ఆ పరమాత్మ భావాన్నే, అగమః పొందగలిగావు. యత్ ఎందుకంటే, క్రౌంచమిథునాత్ - ద్వా సువర్ణా సయుజా సఖాయా అన్నట్లు-పక్షులజంటను పోలిన జీవాత్మ పరమాత్మలలో కామమోహిత మేకమ్ అవిద్యాకామ కర్మలలోకామప్రధానమైన సూక్ష్మశరీరోపాధికమైన జీవభావాన్ని-అవధీః రూపుమాపావు. అంటే ఏమన్నమాట. జీవుడు నిజంలో ఈశ్వరుడే అయినా అవిద్యా కృతమైన కామం మూలంగా ఈశ్వర భావానికి దూరమై జీవభావాన్ని పొందాడు. మరలా తనమనస్సనే ధనుస్సులో బ్రహ్మవిద్య అనే బాణం సంధించి గురిచూచి ప్రయోగిస్తే అది జీవభావమనే పక్షిని పడగొట్టి దానిని సహజమైన బ్రహ్మభావంలోనే మరలా ప్రతిష్ఠ చేస్తుంది. ఇదీ ఇందులోని తాత్త్వికమైన అంతరార్థం. మొత్తంమీద ఈ శ్లోకం శాపరూపంగా పైకి భాసించినా అది కేవలమొక అపదేశం. తద్వారా ముని పుంగవుడైన మహర్షి లోకహిత కామనమైన ఒకానొక ఉదాత్త దృష్టి మనకు హృదయంగమ మవుతున్నది. అదికూడా ద్విగుణీకృతంగా వచ్చి మన హృదయాన్ని తాకుతున్నది. ఒకటి ఆ పరమాత్మ ధర్మ సంస్థాపన చేసి జీవుల నుద్ధరించటానికే ఈ లోకంలో అవతరిస్తాడని. పోతే రెండవది ఈ జీవులందరూ తదుపదిష్టమైన ధర్మమార్గంలో చరించి చివరకు సమ్యగ్ జ్ఞానాన్ని సంపాదించి తన్మూలంగా ఆ పరమాత్మ భావాన్నే అందుకొని తరిస్తారని. ఈ ద్వివిధ ధర్మనిరూపణమే మొత్తం రామాయణ రచన మూలంగా కవి ఈ లోకానికి చాటదలచిన ఉదాత్త భావం. దానికి ఇతిహాసముఖంలో కనిపించే ఈ కిరాత వృత్తాంతమొక ప్రతీక మాత్రమే.

Page 27

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు