వాఙ్మయంలో ప్రప్రథమంగా అవతరించిన శ్లోకమిదే. అందుకే అంటాడు భవభూతి “ఆమ్నాయా దన్యత్ర చ్ఛందసోవతారః" అని మొత్తంమీద వాల్మీకి శోకమే శ్లోకంగా అవతరించింది. అదే ఈ మానిషాద.
మంచిదే. కాని ఏమిటీ శ్లోకానికర్థం. అర్థమేమిటని అడగబనిలేదు. అది శ్లోకం చెవినబడుతూనే మనకు స్పష్టంగా తెలిసిపోతున్నది. నిషాద ఓరి కిరాతుడా ! త్వమ్ నీవు. ప్రతిష్ఠామ్ లోకంలో నివసించటమనేది. శాశ్శతీస్సమాః ఎన్నో ఏండ్లు మాగమః పొందలేవు సుమా ! యత్ ఎందుకంటే క్రౌంచమిథునాత్ - ఈ క్రౌంచ పక్షుల జంట నుంచి ఏకమ్ ఒక దానిని కామమోహితమ్ కామసుఖ మనుభవిస్తుండగా అవధీః నిర్దాక్షిణ్యంగా వధించావు. ఇదీ శ్లోకార్థం. ఇది ఏ మాత్రం సంస్కృత భాషాజ్ఞానమున్నవాడికైనా బోధపడుతుంది. బాధలేదు. అయితే ఇంతవరకే అయితే సుఖంలేదు. మౌని అని వర్ణించాము వాల్మీకి మహర్షిని. మౌని అంటే తనకు భిన్నంగా విజాతీయమైన భావాన్ని దేన్ని గానీ చూడనివాడని కూడా చెప్పాము. అంటే సృష్టిలో ఏది జరిగినా అది మంచిగాని చెడ్డగాని ఉదాసీనంగా చూడగలిగి ఉండాలి. మరి అలాంటి సంయమీంద్రుడి కీక్రౌంచపక్షి సన్నివేశం చూడగానే కన్నీరెలా స్రవించింది. కిరాతుడి మీద కోపమెలా జనించింది. అది శాపాక్షరపరంగా ఎలా పరిణమించదని ప్రశ్న వస్తుంది.
అందుచేత బాహ్యార్థంకాదు మనమిక్కడ గ్రహించవలసింది. బాహ్యార్థానికి స్వస్తి చెప్పి భావార్ధాన్ని పట్టుకోవాలి. ఏమిటా భావార్థం. మా నిషా, మా అంటే లక్ష్మి. యామా సామాయా. మాయా స్వరూపిణి ఆవిడ అంటే పారమేశ్వరి అయిన మూలశక్తి. ఆ శక్తి నధిష్ఠించి ఉన్న పరమేశ్వరుడే మా నిషాదుడు. మా నిషాద ఓ ఆదినారాయణా త్వమ్ నీవు. శాశ్వతీస్సమాః అనేక సంవత్సరాలు, ప్రతిష్ఠామ్ అగమః లోకంలో ప్రతిష్ఠ పొందావు. మా అనే మాట ఇక్కడ మాయాపరంగా సమన్వయించటం మూలాన దానికి వ్యతిరేకార్థం పోయి అనులోమార్థ మేర్పడింది. దానితో ప్రతిష్ఠ పొందవని గాక పొందావనే అర్థం సిద్ధించింది. యత్ ఎందుకంటే క్రౌంచమిథునాత్ - మందోదరీ రావణులనే దంపతులనుండి ఏకమ్ కామమోహితమ్ పరస్త్రీ కామలోలుడైన రావణుడనే ఒక దుర్మార్గుణ్ణి-అవధీః నీవు సంహరించావు. ఇలా అర్థం చెప్పుకొంటే రామాయణ కథా వృత్తాంతమంతా మనకిందులో ధ్వనిస్తుంది.
Page 26