ప్రచేతసుడే ప్రాచేతసుడు. తద్ధిత మిక్కడ అపత్యార్థంలో కాదు. స్వార్థంలో అంటే ప్రచేతసుడే ప్రాచేతసుడు. ఇది రక్షస్సే రాక్షసుడు, వయస్సే వాయసమూ, మనస్సే మానసమూ అనే శబ్దాలలాంటిది. దీనిని బట్టి వాల్మీకికి ప్రాచేతసుడనే పేరు వచ్చిందంటే అది ప్రకృష్ణ జ్ఞానసంపన్నుడయి వల్మీకం నుంచి ఆవిర్భవించటంవల్లనే వచ్చిందని అర్థం చెప్పుకోవటమే సమంజసమని నాకు తోస్తుంది. త్రికాలజ్ఞుడైన మహర్షిని ప్రాచేతసుడని పిలవటంలో ఆశ్చర్యమేముంది.
మొత్తం మీద వాల్మీకి ప్రాచేతసుడయినాడు. సాధకుడు సిద్ధుడయినాడు. కరకు బోయ పరమ ఋషి అయినాడు. "తపస్స్వాధ్యాయ నిరత స్తవస్వీ" అని రామాయణం. ఆయన స్వాధ్యాయమూ, తపస్సూ రెండు లక్షణాలు ఉన్నవాడట. అధ్యయనమూ, అధ్యయనానికి తగిన ఆలోచనా ఇవి రెండే ఉండవలసిన గొప్ప గుణాలు. పోతే వీటి ఫలంగా ఏర్పడవలసింది మౌనం. జ్ఞానమే మౌనమన్నాడు ఆయన శిష్యుడు కాళిదాసు. జ్ఞానం పరిపూర్ణమైతే అది మౌనంగా పరిణమించాలి. వాల్మీకి ర్ముని పుంగవః అనే మాట ఈ భావాన్నే సూచిస్తుంది. ముని భావమే గదా మౌనమంటే. మౌనశబ్దానికింకా అర్థాన్ని అన్వేషిస్తూ పోతే భగవత్పాదులు చెప్పిన “అనాత్మ ప్రత్యయ తిరస్కరణస్య పర్యవసాన” మనే భావం కూడా మనకు స్ఫురిస్తుంది. ఆత్మేతరమైన భావాన్ని దేనినీ సృష్టిలో చూడని వాడెవడో వాడే అచ్చమైన మౌని. అలాంటి మౌని ఈ వాల్మీకి.
ఇలాంటి వాల్మీకి ఒకనాడు శిష్యగణంతో కలిసి స్నానార్థమై తమసానదికి బయలుదేరాడు. అప్పుడా తీరంలో ఆయన కంటికొక అతిదారుణమైన దృశ్యం గోచరించింది. కిరాతుడొకడు వాడియైన బాణంతో ఒక చెట్టుమీద క్రీడిస్తున్న క్రౌంచపక్షిని నేలమీద పడగొట్టాడు. పురుష పక్షిని పడగొట్టగానే దాని వియోగాన్ని భరించలేక పెంటిపక్షి విలవిల తన్నుకొంటూ విలపించటం చూచాడా మహర్షి వెంటనే కరుణారస తరంగితమయిన ఆయన అంతరంగంనుంచి విషాదం పెల్లుబికి అది బలవంతంగా గొంతు పెకల్చుకొని శ్లోకరూపంగా ప్రవహించింది. “మానిషాద ప్రతిష్ఠామ్ త్వమగమ శ్శాశ్వతీ స్సమాః యత్రైంచ మిథునాదేక - మవధీః కామమోహితమ్” ఇది ఒక అనుష్టుప్ శ్లోకం. రామాయణమంతా చాలావరకీ అనుష్టుప్ ఛందస్సులోనే నడిచింది. ఋగాదిచ్ఛందోవాఙ్మయం తరువాత లౌకిక
Page 25