తాను స్వతంత్ర కాదు గదా. అందుకే ఒకసారి రావణుణ్ణి బెదిరిస్తూ సీత అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ - సత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజసా రాముడి అనుమతి లేదు. పైగా నాకది వ్రతభంగం కూడా. అందుచేత నిన్ను భస్మం చేయగలిగి కూడా నేను చేయటంలేదని చాటుతుంది. శక్తి ఎప్పుడూ శక్తిమంతుడికధీనం. శక్తిమంతు డీశ్వరుడు. కనుక ఆ ఈశ్వరుడు రాముడుగా జన్మిస్తే తాను వెంటనే సీతగా జన్మించి ఆయనను ఆశ్రయించింది. ఆయన మానవుడుగా జన్మించాలని కోరుకొంటే తానూ మానవిగానే జన్మించింది. ఆయన సర్వజ్ఞుడైనా పైకి మానవోచితంగా మెలగుతుంటే తానూ దానికి తగినట్టు మానవోచితంగానే జీవితం సాగించింది. తన ధనుర్బాణ కవచ ఖడ్గాది దివ్యాయుధాలన్నీ ఆయనకు సమర్పించింది. తన కార్యమాయన చేత చేయించింది. అయితే ఇదంతా అభినయమే. ఆయనదీ అభినయమే. ఆవిడదీ అభినయమే. మానవరూపం దాల్చి అభినయించే దేవదేవుడు రాముడైతే ఆయనను ఛాయలాగా అంటిపెట్టుకొని అలాగే అభినయించే దైవీశక్తి సీత. దేవకార్య నిర్వహణకోసమే ఇద్దరి ఈ మహాభినయము, అంతరమైన ఆ సంకల్పానికి బాహ్యమైన కవచమే వారి జీవిత కథ అంతా.
ఈ దృష్టితో చూడాలి మనం సీత వృత్తాంతమంతా రామాయణ మహాకావ్యంలో దేవకార్యం కోస మావిర్భవించిన దేవమాయే ఆవిడ. భూగర్భంలో నుంచి వచ్చింది. మరలా ఆ భూగర్భంలోకే వెళ్ళిపోయింది. దివ్యశక్తి మానవజన్మ ఎత్తింది కాబట్టి మానవులందరి మాదిరే భూమి నుంచి జన్మించింది. ప్రయోజనం తీరిపోగానే ఇక ఈ మానవోపాధితో పనిలేదు కాబట్టి దానిని మరలా ఈ కర్మభూమికే అప్పగించి అంతర్ధానమయింది. మనం చూడటం కాదసలు. తెలిసో తెలియకో రామాయణ పాత్రలు కూడా ఆవిడ నీ దృష్టితోనే చూచారన్నా ఆశ్చర్యం లేదని తోస్తుంది. దృశ్యా దృశ్యంగా ప్రతి ఒక్కరికీ ఆవిడలో శక్తి రూపమే సాక్షాత్కరించింది జనకుడి మాటలే విన్నాముగదా ఇప్పడు. పతివ్రతా మహాభాగా అని ఆ పరాశక్తినే కీర్తించినట్టున్న దాయన మాట. పోతే రాముడికి చాలా ఇష్టమైనదట ఆవిడ. కారణం తల్లిదండ్రులు చూచి చేశారని. కాదు తల్లిదండ్రులు చూచిచేసేదేమిటి. ఎప్పుడు చూచారు. ఎప్పుడు చేశారు వారు. అది వట్టిమాట. ధనుర్భంగం చేసి కదా తానావిడను చెట్టపట్టింది.
Page 265