మెలగుతుంటుంది. అదే ఆవిడ హిమవచ్చిఖరంమీద కూచొని తపస్సు చేయటం రావణుడు బలవంతం చేయబోయినా వాడికీ దక్కలేదా శక్తి. కారణం వాడు సహజంగా రాక్షసుడు కాదు. బ్రహ్మ వంశోద్భవుడే. కాని బ్రహ్మమైన శమదమాది సంపత్తిలేదు వాడికి. అసురమైన చర్యలతో అది వాడికెప్పుడో అంతరించింది. అయినా దైవశక్తిని దక్కించుకోవాలని వ్యర్థప్రయత్నం చేశాడు. అది వాడికి దక్కకపోగా వాణ్ణి శపించి యోగాగ్ని జ్వాలలో దగ్ధమయింది. దగ్ధం కావటం కాదది చిదగ్నికుండ సంభూతా అన్నట్టు చిదగ్ని కుండంలో నుంచే ఆవిర్భవించింది గనుక జగన్మాత మరలా ఆ చిదగ్నికుండంలోనే పోయి చేరింది. అసురసంపద కందకుండా అదృశ్యమై పోయిందని అర్ధం.
అదృశ్యమయిందే గాని ఎక్కడికీ పోలేదా మహాశక్తి. వ్యక్తమైన రూపాన్ని ఉపసంహరించుకొన్న దంతమాత్రమే. దాని కసుర విజృంభణమే కారణం గనుక వారి విజృంభణాన్ని అణచివేసి దైవగుణ సంపన్నుల నుద్ధరించాలని మరలా బద్ధకంకణ అయింది. దేవకార్య సముద్యతా అని వర్ణించారమ్మవారిని. దేవతలంటే దైవ సంపద్విశిష్టులైన శిష్టులు. అలాంటి శిష్టులకు దుష్టులైన రావణాద్యసురలవల్ల ముప్పు వాటిల్లుతున్నది. అందుచేత దుష్టశిక్షణ చేసి శిష్టజనరక్షణ చేయాలి. అదే దేవకార్యమంటే. అందుకోసం మరలా ఆవిడ చిదగ్నికుండంలో నుంచే ఆవిర్భవించాలి. అందుకే సీతగా మరలా అవతరించిందా పరాశక్తి. సీతను దేవయజన సంభవ అని వర్ణించాడు వాల్మీకి. దేవకార్య సముద్యతా అనే మాటకిది ప్రతిధ్వని ఈ మాట. దేవతల ప్రీత్యర్ధం జనక మహారాజు యజ్ఞం చేయదలచాడు. యజ్ఞభూమి దున్నుతుంటే హలముఖం నుంచి ఆవిర్భవించిందమ్మ. అందుకే సీత అని పేరు పెట్టాడాయన. సీతాలాంగల పద్ధతిః సీత అంటే హలరేఖ అనే శబ్దార్ధం. ఇక్కడ ఒక చమత్కార మేమంటే చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించవలసిన అమ్మవారిక్కడ భూగర్భం నుంచి జన్మించింది. అంటే ఏమన్నమాట. దైవి అయిన శక్తి మానవిగా సాక్షాత్కరించింది లోకానికి. ఉత్తమే శిఖరేజాతే - భూమ్యాం పర్వత మూర్ధని. పర్వత మూర్ఖంలో ఎక్కడో ఉన్నత శిఖరాల్లో దూరదూరంగా అందకుండా సంచరించేది అదే. అవసరమైతే భూమి మీద మనకందే రూపంలో కనిపిస్తూ మనమధ్య తిరిగేదీ అదే. ఆ దివ్యశక్తే. దివ్యం మానుషమనేది కేవలం దాని ఉపాధులే.
Page 263