#


Index

సీతా మందోదరులు

సీతా మందోదరులు

  ఇక్కడికి రామానుజులు, రామాశ్రితులు, ఇరుతెగల వారినీ గూర్చి చర్చించాము. పోతే ఇక ప్రధాన పాత్రలైన రామరావణులే మిగిలి ఉన్నారు. రామాయణమైనా రావణాయనమైనా వారిద్దరినీ బట్టే ఉన్నది సర్వమూ. వారిద్దరి సుద్దీ చెప్పుకొంటే సర్వమూ బుద్ధికి వచ్చినట్టే. అయితే వారి సంగతి తడవి చూచే ముందు వారి అర్ధాంగులను గూర్చి తెలుసుకోవటమెంతైనా అపేక్షణీయం. కారణం అర్ధాంగులు గనుకనే. అర్ధాన్ని కాదనుకొంటే మిగతాది మనకర్థమేకాదు. కనుక ఉత్తరార్ధం రామ రావణులైతే పూర్వార్ధం వారి ధర్మపత్నులు. ధర్మపత్నులన్నందుకిద్దరూ నిజంగా ధర్మపత్నులే. ఇద్దరూ మహాపతివ్రతలే. ఇద్దరికీ ఒకరి యెడల ఒకరికి సానుభూతి ఉన్నది. గౌరవమున్నది. అవసరం రాలేదు గనుక సీత బయటపడి చెప్పలేదుగాని మందోదరి సమయం వచ్చినప్పుడంతా బాహాటంగానే ఆవిడను ప్రశంసిస్తూ వచ్చింది. అయితే ఇద్దరిలో తేడా ఏమంటే ఒకరు దానవి అయితే ఒకరు మానవి. ఒకరు నగరాలు, వనాలు, పర్వతాలు, సముద్రాలు ఒకటేమిటి. దేశదేశాలు తిరిగి కష్టాలపాలైతే మరొకరు ఎండకన్ను వానకన్ను ఎరగకుండా కాలు కదపకుండా స్వగృహంలోనే హాయిగా కాలక్షేపం చేస్తూ వచ్చారు. కొంచెం ముందు వెనుకగా ఇద్దరూ భర్తృవియోగ మనుభవించవలసి వచ్చింది. ఒకరు తన వియోగం చేత భర్తను బాధపెట్టి పోతే మరొకరు భర్తృవియోగంచేత తాను యావజ్జీవము బాధపడవలసి వచ్చింది. ఒకరు సర్వాన్నే వదలి పోవలసి వస్తే మరొకరిని సర్వమూ వదలిపోయింది. అసలిదంతా కాదు. ఇదంతా బాహ్యంగా మనం చెప్పుకొనే కథ. ఆంతర్యం ఆలోచిస్తే సీత సీత గాదు. మందోదరి మందోదరి కాదు. సీత దేవమాయ అయితే మందోదరి రాక్షసమాయ. ఇదీ అసలు కథ. దేవమాయేవ నిర్మితా అని సీతా సౌందర్యాన్ని వర్ణిస్తూ వాల్మీకే ధ్వనింపజేశాడీ విషయం. మరి మందోదరి ఎవరోకాదు. దానవశిల్పి అయిన మయుడి కూతురు. మయుడి కూతురన్నప్పుడే సాక్షాత్తూ ఆవిడ అసురమాయ అని చెప్పటానికిక ఆక్షేపణ లేదు. కాబట్టి రామరావణ సంగ్రామమంటే అప్పటికి దేవాసుర శక్తిద్వయ సంఘర్షణమే ఈ కథావస్తు రహస్య మంతా. కనుక ఈ శక్తిద్వయ స్వరూపమేమిటో పరీక్షించి చూడటమెంతైనా ఆవశ్యకం.

Page 261

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు