నా రాజ్యాన్ని హితులనూ ధనాన్నీ అంతా వదలివచ్చాను. నాకు రాజ్యమైనా బంధువులైనా ధనధాన్యాలైన అంతా నీవే. ఇది అనన్య భావంతో శరణువేడటమంటే అలా వేడిన వాడిలో భగవచ్ఛక్తి పూర్తిగా ప్రవేశిస్తుంది. దానితో భగవత్కార్య ప్రణాళికకు తానూ దోహదకారి అవుతాడు. రాజసతామస శక్తులను నిర్మూలించి ఘనవిజయం సాధిస్తాడు. అసుర శక్తులను అదుపులో ఉంచుకొని సాత్త్వికమైన ధర్మమార్గంలో రాజ్యం చేయగలుగుతాడు. అదే విభీషణుడు రాముడికి సహకరించి ఆయన అనుగ్రహంతో రావణుణ్ణి తొలగించి తద్వారా రాజస పాలనకు స్వస్తి చెప్పి సాత్త్వికమైన తనపాలన కొనసాగించటం. అలాంటి పాలన కలకాలము ఉండాలనే ఈశ్వర సంకల్పమూ జీవుడి ఆశయమే విభీషణుడి అమరత్వం. హనుమద్విభీషణలిద్దరే రామాయణ పాత్రలలో అమరులై నిలిచింది. హనుమంతుడు జ్ఞానానికి, విభీషణుడు సత్త్వశుద్ధికీ చిహ్నాలను కొంటే మానవ లోకానికి సత్త్వజ్ఞానాలనే రెండు సంపదలూ తరగకుండా చిరకాలము వర్ధిల్లాలనీ అదే మానవ జీవితానికి విజయమనీ ఇందులో దాగి ఉన్న సందేశం.
అంతేకాదు. రాముడు మహాప్రస్థానం చేసేటప్పుడు అందరినీ వెంట బెట్టుకొని పోతుకూడా తనతో రానీయక ఈ కర్మ భూమిలోనే నిలిపిపోవటం కూడా మానవుల కెప్పటికీ ఈ సత్త్వజ్ఞానాలనే లక్షణాలు అలవరచుకొని బ్రతకండని బోధించటానికే. - హనుమద్విభీషణులిద్దరూ అజరామరులూ వారిప్పటికీ జీవించి ఉన్నారని మహర్షి వర్ణించటం కూడా సాత్త్వతులూ జ్ఞానులూ లోక సంగ్రహార్ధమెప్పుడూ మన మధ్య ఉంటూనే ఉంటారని వారి బోధామృతాన్ని క్రోలి ముముక్షువులెప్పుడూ పరమ పురుషార్ధానికి కృషి చేస్తుంటారని చాటటానికే. అందుకేనేమో తన గురువుగారి కవితా హృదయం బాగా తెలిసిన కాళిదాసు కూడా రఘువంశ మహాకావ్యంలో రామకథనంతా వర్ణించి చివర ఒక గొప్ప సుభాషితంతో ముగిస్తాడు.
లంకానాథం పవన తనయం శోభయం స్థాపయిత్వా కీర్తిస్తంభద్వయ మివగిరౌ దక్షిణే చోత్తరేచ
అవతారాన్ని చాలిస్తూ పరమాత్మ హనుమద్విభీషణుల నిద్దరినీ రెండు కీర్తి స్తంభాలలాగా దేశానికుత్తరాన దక్షిణాన ఉండే రెండు కొండలమీద ప్రతిష్ఠించి వెళ్లిపోయాడట. వాస్తవమే. ఆత్మా రామ తత్త్వాన్ని నిరంతరము సాధక లోకానికి జ్ఞాపకం చేసే ఆ మహాపురుషులిరువురూ రెండు కీర్తి స్తంభాలే. కాకపోవటమేమిటి.
Page 260