#


Index

హనుమ ద్విభీషణులు

చాలు మిగతా తొంబది ఎనిమిది కూడా ఉన్నట్టే మానవుడికి. ఇలాంటి సకల గుణాభిరాముడి రాజ్యంలో శాంతి సౌఖ్యాలెలా బ్రతకగలవు. ఇక్కడ రావణుడనీ రాక్షస రాజ్యమనీ కేవలం సంకేతాలే. రాక్షసరాజ్యమీ అసుర సంపదతో కూడిన ప్రాపంచిక జీవితమే. ఇది రాజసమైన ప్రవృత్తి కధీనమైనంతవరకూ అది రావణ రాజ్యమే. అందులో లవలేశం మనకు సుఖముండబోదు సుఖశాంతులే కావాలంటే రాజసుడికిగాక సాత్త్వికుడైన వాడి అధీనంలో ఉండాలి జీవితం. అది వ్యక్తి జీవితమే కాదు. సమాజ జీవితం కూడా నా విష్ణుః పృథివీపతిః అని నానుడి విష్ణ్వంశ అంటే సత్త్వగుణమే. సత్త్వగుణ విశిష్టుడైన రాజు పరిపాలించినప్పుడే అది అశాంతిని దూరం చేసి శాంతిని ప్రసాదిస్తుంది లోకానికి.

  అయితే ఈ సత్త్వం సహజంగా కొంత ఉన్నా అది చాలదు. రజస్తమో గుణ సహవాసం చేత దూషితమై బలాన్ని కోలుపోయి ఏమీ చేయజాలని దురవస్థకు పాలయి ఉంటుంది. అదే లంకలో విభీషణుడి అసహాయ స్థితి. అది మరలా బలాన్ని పుంజుకొని రజస్తమస్సుల మీద విజయం సాధించాలంటే అందుకు శుద్ధ సత్త్వోపాధి అయిన ఈశ్వరుడే శరణ్యం. సత్త్వమే అయినా ఆయన సత్త్వం పరిశుద్ధం. పరిపూర్ణం. అలాంటి సమిష్టి సత్త్వోపాధి అయితే గాని జీవుడీశ్వరుడి లాగా విజయం సాధించలేడు. విభీషణుడు రాముణ్ణి వచ్చి హడావుడిగా శరణు వేడాడంటే ఇదీ దాని అంతరార్ధం. ఈ అంతర్యం సుగ్రీవాదులెవ్వరూ గ్రహించలేకపోయారు. రాముడందరినీ పరీక్ష పెట్టి చూచి చివరకు హనుమంతుణ్ణి సలహా అడుగుతాడు. ఆయన ఒక్కడే రామహృదయం విభీషణ హృదయం రెండూ చక్కగా గ్రహించి చెప్పినవాడు. అతనిమీద నెపం పెట్టి రాముడు తన మనోనిశ్చయ మపుడు బయటపెడతాడు. ఏమని సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతిచ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ర్వతం మమ ఎవడైనా సరే. ఒక్కమారు ఇచ్చి నీవాడనే నేనని నన్ను ప్రపన్నుడైతే చాలు. వాడికి నేను సర్వదా అభయదాయకుణ్ణి పొమ్మంటాడు. అంటే ఏమన్నమాట. సత్త్వగుణాన్నే సర్వాత్మనా ఆశ్రయించేవాడికి భగవత్సాహాయ్యమెప్పుడూ ఉంటుందనే గదా. అపుడు సుగ్రీవాదులంతా చప్పబడి కూర్చుంటే విభీషణుడు అంతరిక్షం నుంచి క్రిందికి దిగి రామపాదాల మీద వాలి భవంతం సర్వభూతానాం శరణ్యం గతః పరిత్యక్తామయా లంకామిత్రాణిచ ధనానిచ - భవానేవచమే రాజ్యం జీవితంచ సుఖానిచ. స్వామీ నేను సర్వభూత శరణ్యుడైన నిన్ను శరణువేడి వచ్చాను.

Page 259

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు