#


Index

హనుమ ద్విభీషణులు

కూడా ఒక దుర్మార్గాన్ని అరికట్టటాని కవకాశాలుండి కూడా దాని నుపేక్షించిన వాడవుతాడు. అంతకన్నా ఆత్మవంచన ఏముంది.

  పోతే ఇక లౌకికంగా గాక పారలౌకికంగా చూచినా ఇందులో ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యమిమిడి ఉంది. ఇంతకు ముందు విభీషణుడి దృష్టితోనైతే ఇప్పుడిది రాముడి దృష్టితో చూచి చెప్పవలసిన మాట. రాముడు కూడా ఒక అవకాశవాది. మిత్రభేదం చేసి బలహీనుడైన శత్రువును మట్టుపెట్టాడని గదా మన ఆక్షేపణ. రాముడంటే మానవుడనే గాదు. మనవేంద్రుడుగా మానవాతీతుడైన ఈశ్వరుడుగా కూడా చూడాలి మనమెప్పుడూ. మానవుడుగా అవకాశవాది అయినా, మానవేంద్రుడుగా ఇది ఒక గొప్ప రాజనీతి. మిత్రలాభమెలాగో మిత్రభేదం కూడా అలాగే రాజులకు కర్తవ్యం. అందులోనూ ద్రోహబుద్ధి లేదిక్కడ. ద్రోహబుద్ధి రావణుడిది. రాముడిది కాదు. రావణుడతని భార్యనతడు లేని సమయం చూచి దొంగిలించి తెచ్చిన ఒక దోపిడి దొంగ. అది బాహాటంగా అతనితో పోరాడి ప్రతీకారం చేయాలని వచ్చిన ఋజువర్తనుడు రాముడు. అయితే అతడి తమ్ముణ్ని చేరదీయటం తప్పుగదా. అంటే తమ్ముణ్ణి తన దగ్గరికి బలవంతంగా తెచ్చుకోలే దాయన. అతడే వచ్చి శరణువేడితే సంగ్రహించాడు. అంత మాత్రమే. కాని ఇద్దరి విషయంలోనూ అహంకారిగా ప్రవర్తించాడు రావణుడు. అలాంటి అహంకారి ఒక విశాల రాజ్యానికి ప్రభువుకారాదు. అయితే శాంతి భద్రతలుండవు. అందుకే తన వ్యక్తికేగాక సమస్త లోకానికి ద్రోహం తలపెట్టిన అతణ్ణి ఇక రాజుగా కొనసాగనీయరాదు. అలాంటివాడు రాజుగా పనికిరాడు. పనికి వచ్చే వాడెప్పటికైనా ఇలాంటి సాధుశీలుడేనని లోకానికి చాటటమే ముందుగా విభీషణుడికి చేసిన పట్టాభిషేకం.

  పోతే ఇక మానవాతీతుడైన ఈశ్వరుడుగా ఎలా గ్రహించాలి వ్యవహారం. రాముడంటే ఈశ్వరుడు. సగుణమైన బ్రహ్మమేగదా ఈశ్వరుడంటే ఆ గుణమేమిటి? శుద్ధసత్త్వం. అదే ఉపాధి ఈశ్వరుడికి ఈ సత్త్వగుణానికి కేవలమొక ప్రతీకే విభీషణుడు. అతడు రాముణ్ణి వచ్చి ఆశ్రయించాడంటే అర్ధం శుద్ధమైన సత్త్వగుణం పరమాత్మను ఆశ్రయించింది. రజస్తమస్సులతో చేరినా వాటితో ఎంతోకాలం కలిసి ఉండలేదది. కలిస్తే తానూ కలుషితమయిపోతుంది. అప్పుడు వాటిదే ఇక ఇచ్ఛారాజ్య మవుతుంది. అలాగే సాగింది ఇన్నాళ్లూ అన్నగారి రాజ్యం. రజస్సే రావణుడు. దాని లక్షణాలు ఒకటి అహంకారం మరొకటి అతిలోలత్వం. ఇవి రెండూ ఉంటే

Page 258

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు