#


Index

హనుమ ద్విభీషణులు

ఒకవేళ అతడు రాజ్యలుబ్ధుడయి తన్ను శరణు వేడినా అన్నీ తెలిసిన రాముడంతగా కక్కుర్తిపడి అతణ్ణి వెంటనే తనపక్షంలో కలుపుకోవటమే గాక అప్పటికప్పుడే అతణ్ణి రాక్షస రాజ్యానికంతా పట్టాభిషిక్తుణ్ణి చేయటమంతకన్నా అన్యాయం. ఇంకా తాను రావణుణ్ణి చంపలేదు. పెట్టలేదు. అప్పుడే ఏమి మించి పోయిందని ఈ చర్య. ఇదంతా చూస్తే విభీషణుడొక మేక వన్నె పులి, రాముడొక తృణచ్ఛన్న కూపమని తోస్తుంది మనకు.

  కాని కొంచెం లోతుకు దిగిచూస్తే గాని ఇందులో దాగి ఉన్న పరమార్ధం బోధపడదు మనకు. మనది చాలా హ్రస్వదృష్టి. మనకు తోచిన ప్రమాణాలు కొన్ని పెట్టుకొని ఆ ప్రమాణ దండంతోనే కొలవటానికి ప్రయత్నిస్తా మాయాపాత్రల స్వభావాలను చేష్టలను. అందులో ఏమి దాగి ఉన్నదో తరచి చూచే ఓర్పూ, నేర్పు తక్కువ. ఇక్కడి ధర్మసూక్ష్మం. విభీషణుడు రావణ కుంభకర్ణులతో పుట్టాడు. వారితోనే పెరిగాడు. వారితోనే కలసి కాలక్షేపం చేస్తూ వచ్చాడు. అతడూ ఒక రాక్షసుడే. అయితే రాక్షసుల స్వభావం లేదతనికి సాధు స్వభావుడు. ధర్మవర్తనుడు. అధర్మకార్య మంటే సరిపడదతనికి. అలాటివాడు రాజ్యం పాలించగూడదు. పాలిస్తే యధారాజా తధా ప్రజాః అని వాడు చెడటమే గాక ప్రజలు కూడా చెడిపోతారు. దానితో రాజవంశమూ, రాజ్యమూ రెండూ దెబ్బతింటాయి. అది ఎవరికీ సుఖంలేని వ్యవహారం. ప్రస్తుతం తన అన్న రావణుడలాంటి అధార్మికుడూ వ్యసనాభిభూతుడూ అయి కూర్చున్నాడు. అనవసరంగా సాధువులను వేధించటము అతిదారుణమైన కామోద్రేకానికి గురి కావటము అతనిలో మొదటి నుంచీ కనిపెట్టి చూస్తున్నాడు. జీవితంలో అడపా దడపా తగిలే ఎదురు దెబ్బలకైనా తెలుసుకొని బాగుపడతాడేమోనని చూచాడు. కాని బాగుపడలేదు సరికదా అదే గొప్ప అని భావించి అలాంటి వందిమాగధులను చుట్టూ చేర్చుకొని జీవిస్తున్నాడు. ఇలాంటివాడు పరిపాలిస్తే ఏమయినా ఉన్నదా సుఖశాంతులకు నోచుకోగలదా దేశం. ఇక ఉపేక్షించి లాభంలేదు. అది మూలోచ్ఛేదమని భావించాడు విభీషణుడు. సామంగా చెప్పి చూచాడు. ఫలితమివ్వలేదు. ఆఖరిసారిగా ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రమేదో కాదు. నిర్మోగమాటంగా మొగం వాచేలా చీవాట్లు పెట్టడం. అది కూడా చివరకు విఫల మయింది. విఫలం కావటమే గాక తన మనుగడకే ముప్పు తెచ్చేలా తయారయింది.

Page 256

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు