కాని ఇప్పుడిక అలా ఉపేక్షించటానికి లేదు. శ్రుతిమించిపోయాడు. ననశ్యంత ముపేక్షేయమ్ - ప్రదీప్తమ్ శరణమ్ యథా తన వినాశాన్ని తానే కొని తెచ్చుకోబోతున్నాడు. కాలిపోయే భవనమెలా కూలిపోతుందో అలా కూలబోతున్నాడు. నత్వామిచ్ఛామ్యహంద్రష్టుం రామేణ నిహతం శరైః అన్నా నీవలా రామబాణాగ్ని జ్వాలల కాహుతి అయిపోవటం నేను నాకండ్లతో చూడవలసి వస్తుందే అని నీ మనసుకు కఠినంగా తోచినా సరే మాట్లాడాను. నీవు పెద్దవాడవు. నేనేదైనా అనుచితంగా మాట్లాడి ఉంటే నన్ను మన్నించు. ఆఖరిమాట చెప్పి వెడుతున్నాను. విను. ఆత్మానం సర్వధా రక్ష - పురీంచేమాం సరాక్షసాం - స్వస్తితేస్తు - గమిష్యామి సుఖీభవ మయావినా, నిన్నూ నీవాళ్లనూ కాపాడుకో. నీకు మేలు కలుగుగాక. నేను లేకుండా నీవు సుఖంగా ఉండదలిస్తే ఉండు. ఇక వెళ్లి వస్తానని సెలవు తీసుకొని వెళ్లిపోతాడు.
చూచారా. దీనినే కాకువంటారు శాస్త్రజ్ఞులు. విధిరూపంగా పైకి కనిపిస్తున్నా నిషేధార్ధం ధ్వనిస్తుందంటారు అలంకారికులు. నేను లేకుండా మీరంతా సుఖపడండి అంటే అర్ధం. ఎలాగూ సుఖపడరని. కొందరైనా సత్పురుషులుండబట్టే ఈ లోకమెందరు దుర్మార్గులెంత దుష్కృత్యాలు కొనసాగిస్తున్నా నిలిచి ఉండేది. అలాంటిది ఉన్న ఒక్కడే పుణ్యపురుషుడయినా ఆ ఒక్కడూ కూడా దూరమై పోతే ఇక ఆ రాజ్యమూ ఆ పరిపాలనా దక్కటానికేనా. పైగా సర్వ సమర్థుడైన పరమాత్మ తప్ప జూచినప్పుడు. సర్వనాశనమయి తీరవలసిందే. అదీ ఇక్కడ విభీషణుడి మాటలలోని ధ్వని. ఈ మాటలని ఇక క్షణం నిలవ లేదక్కడ విభీషణుడు. ఆజగామ ముహుర్తేన-యత్రరామః సలక్ష్మణః లక్ష్మణసమేతుడై ఉన్న శ్రీరామచంద్రుని సన్నిధికి బయలుదేరిపోతాడు.
ఏమిటీ వ్యవహారం. విభీషణుడు చేసిన పని ఏమి బాగుంది. అన్న తన మాట వినలేదనే గదా ఆగ్రహం. మహా అయితే కొంత పురుషంగా మాట్లాడాడు తన్ను. ఆ మాటలకు వస్తే తానంతకన్నా కటువుగా మాట్లాడాడతణ్ణి. ఇంతకుమించి అతడేమి చేయలేదు. తన్ను బయటికి వెళ్లి పొమ్మని వెళ్లగొట్టలేదు గదా. అలాంటప్పు డిష్టంలేకపోతే ఎక్కడికైనా అడవులకో కొండలకో ప్రవాసం పోవచ్చుగాని అతడి శత్రుపక్షమైన రాముణ్ణి పోయి ఆశ్రయించటమేమి న్యాయం. దేశద్రోహమూ, స్వామి ద్రోహము గదా ఇది. విభీషణుడిలాంటి ధర్మాత్ముడు చేయవలసినపనియేనా ?
Page 255