#


Index

హనుమ ద్విభీషణులు

శత్రుపక్షంవాడితో ఒక్క క్షణం నివసించలేము. విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే జ్ఞాతితో భయం - స్త్రీలకు చాపల్యమెలా సహజమో జ్ఞాతి అయినవాడికి భయావహత్వ మంత సహజం. ఇంతెందుకు. విభీషణా ఒక్కమాట చెబుతున్నాను విను. అన్యస్త్వేవం విధంబ్రూయా ద్వాక్యమేతన్ని శాచర అస్మిన్ ముహూర్తేన భవేత్త్వాంతుథిక్ కులపాంసనమ్. మరొక డెవడైనా ఇపుడు నీవన్నమాటలన్నాడో ఈ క్షణంలో వాడు నామరూపాలు లేకుండా పోయేవాడు. మరి నీవు మా కులంలో చెడబుట్టావు. నిన్నేమి చేయగలను నేను. అని తుస్కారంగా మాట్లాడతాడు. ఇక్కడ విభీషణుణ్ని రావణుడు కాలితో తన్నాడు. చేశాడని చెబుతారు. అది వట్టిది. రామాయణ మాతృకలో అలాంటి వ్యవహారమేదీ లేదు. అలా ఎప్పటికీ చేయడు రావణుడు. చేయలేడు. విభీషణుడంటే చాలా నిజాయితీపరుడని అతనికి లోలోపల ఒక గౌరవమున్నది. భయమున్నది. అయితే అంతకన్నా తనచేష్ట సమర్ధించుకోవాలనే పంతం కూడా ఉన్నవాడు కాబట్టి అతని మాట పాటించడంత మాత్రమే. అలా పాటించక రెండుమార్లు మౌనం వహించాడు. కాని మూడవమారు మరీ అతడు హీనమానంగా తన్నూ తన కుమారుణ్ణి దూషించేసరికి సహించలేక పోయాడు. అప్పటికీ అతడి ముఖం చూచి నేరుగా అనలేక భంగ్యంతరంగా చంపుతానని బెదిరించాడు.

  ఒక నిజాయితీ చూస్తే లోకంలో ఎప్పుడూ ఇంతే. చూస్తూ చూస్తూ అనటానికి నోరురాదు. అతడి నిజాయితీ స్వభావమే ఒక పెద్ద ఆయుధం. అది ఎంత బలవంతుడికి కూడా అభేద్యం. ఇలాంటి ప్రబలమైన ఆయుధం చేపట్టినవాడు కాబట్టి విభీషణుడికి రావణుడన్నా భయంలేదు. రావణి అన్నా భయంలేదు. పరుషంగా అన్న మాట్లాడాడో లేదో వెంటనే చీ అని కోపంతో తన నలుగురు ఆప్తులతో ఆకాశాని కెగిరిపోయి క్రిందికి చూచి రావణుడితో సత్వం భ్రాతాసిమే రాజన్ - బ్రూహిమాం యద్యదిచ్ఛసి రాజా నీవు నాకు అగ్రజుడవు. నీ ఇష్టం. తండ్రితో సమానుడవు. మాననీయుడవు. అయితే ఏమి చేయాలి. నచ ధర్మ పధేస్థితిః ధర్మమార్గంలో లేవు మరి. చూడండి. ఎంత మర్యాదో. ఎంత మందలింపో ? అన్న ధర్మమార్గంలో లేడని ఎప్పుడో గ్రహించాడా సజ్జనుడు. అయితే విద్వాంసుడు గదా - ఎప్పటికైనా తన తప్పు తెలుసుకొని బాగుపడకపోతాడా ? అని ఇన్నాళ్లూ ఒప్పరికిస్తూ వచ్చాడు.

Page 254

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు