#


Index

హనుమ ద్విభీషణులు

పోయాము మనం. అసలు మనం చేసిందే తప్పు. ఆయన నీకేమి అపకారం చేశాడని ఆయన భార్యను నీవపహరించి తెచ్చావు. ఖరుణ్ణి ఆయన వధించాడంటావా? అది వాడు చేసుకొన్నదే. వాడు దురుసుగా ప్రవర్తిస్తే ఆత్మరక్షణ కోస మాయన వాణ్ణి వధించవలసి వచ్చింది. పరదారామర్శనమనేది పాపిష్టమైన కార్యం. అది మనకెంతైనా అనర్థకరం. సీతా నిమిత్తంగా మృత్యువును నెత్తికి తెచ్చుకొంటావు. ఆవిడను రాముడికీ మరలా అప్పగిస్తే చాలా మేలు. యావత్స సగజామ్ సాశ్వాం బహురత్న సమాకులం - పురీందారయతే బాణైర్దీయతా మస్య మైథిలీ కోపం వచ్చి ఆయన మన రాజ్యాన్నంతా సర్వనాశనం చేయకముందే ఆ పనిచేయి. వినశ్యేద్ధి పురీలంకా - స్వయం యదిన దీయతే నీకై నీవు ఒప్పజెప్పకపోయావో లంకమీద ఇంక మనకాశలేదు. ప్రసాదయేత్వాం బంధుత్వాత్ - జీవేమ సపుత్ర బాంధవాః ప్రదీయతాం దాశరథాయ మైథిలిని అప్పగించు మనమూ మన బంధువులమూ బ్రతికిపోతామని బ్రతిమాలుతాడు. ఎప్పటినుంచో చెప్పాలనుకొన్నదంతా అతనికెంత సుతిమెత్తనగా ఎంత సంగ్రహంగా ఎంత బలంగా బోధించాడో చూడండి. దీనికి క్రోధంతో మండి పోవలసిందా దశగ్రీవుడు. అయితే ముందు చెప్పినట్టు అతడికీ తెలుసు కాబట్టి తమ్ముడి స్వభావం పైగా ఎప్పుడూ బయటపడి చెప్పలేదు కాబట్టి ఏమీ మాట్లాడకుండా సభ చాలించి వెళ్లిపోయాడు. అంతేకాదు. దుర్మార్గుడికి సన్మార్గుణ్ణి చూస్తే ఒక కానరాని భయముంటుంది మనసులో. అది ఒక పిరికితనమిస్తుంది. దానితో గట్టిగా బదులు చెప్పలేక మొగం తప్పిస్తాడు. అలాగే తప్పించుకొని వెళ్లిపోయాడు ప్రస్తుతం రావణుడు.

  విభీషణుడు విడిచిపెట్టలేదు. పిలవకపోయినా మరలా రెండవ రోజుదయమే బయలుదేరి వచ్చాడు రావణుడి దగ్గరికి. సపూజ్యమానో రక్షోభి-ర్దీప్యమానః స్వతేజసా ఆసనస్థం మహాబాహుర్వ వందేధనదాగ్రజమ్. రాక్షస జనమంతా నమస్కరించి ప్రక్కకు తొలగుతుంటే వచ్చి అన్నగారికి నమస్కరించి అతడనుజ్ఞ ఇస్తే ఆసన పరిగ్రహం చేస్తాడు. దేశకాలోచితంగా సాంత్వనమైన మార్గంలో అతనికి కొన్ని హితోక్తులు చెబుతాడు. సీతామాతను తెచ్చినప్పటినుంచీ పట్టణంలో జరుగుతూ ఉన్న ప్రకృతి బీభత్సమంతా పూస గ్రుచ్చినట్లు వర్ణిస్తాడు. దీనికి ప్రాయశ్చిత్తం మరేదీగాదు. వైదేహిని మరలా దాశరథి కప్పగించటమే. మరి నేను విన్నదీ కన్నదీ హితైషిగా నీకు చెప్పాలి

Page 251

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు