తగినట్టే ఉందావిడ స్వభావం కూడా. మానస సరస్తీరంలో పుట్టి తన పుట్టుకతో అది పొంగిపోతుంటే వద్దని తల్లి నిషేధించటం మూలంగా ఆమెకు సరమ అని పేరు వచ్చిందట. విభీషణుడికి భీషణత్వం లేనట్టే ఆవిడకు కూడా విజృంభణ లేదు. ఇద్దరికీ నిగ్రహం ప్రకృతి సిద్ధంగానే వచ్చిందని అందులో ఆవిడకు సరస స్వభావం కూడా ఉన్నదనీ భావం. వీరిద్దరికీ జన్మించిందే త్రిజట అనే కన్య. ఆవిడకూ తల్లిదండ్రుల సౌజన్యమే సంక్రమించింది. సీతాదేవి నా సంవత్సర కాలము ఆదుకొన్నదీ కష్టంలో ఆశ్వాసిస్తూ వచ్చినదీ ఆవిడ ఒక్కతే.
పోతే వివాహం ముందునుంచీ తరువాత నుంచీ కూడా అన్నగారి ఘనకార్యాలు గమనిస్తూనే ఉన్నాడు విభీషణుడని చెప్పాము. అయితే అతడే పనులు చేస్తున్నా ఎంత దుండగంగా ప్రవర్తిస్తున్నా అతణ్ణి ఎప్పుడూ మందలించలేదు. ఒక్కదానికైనా అడ్డు చెప్పలేదు. అతడు తన సొంత అన్న కుబేరుడితోనే జగడం పెట్టుకొన్నాడు. అతడు పంపిన దూతను చంపివేశాడు. యుద్ధంలో అతణ్ణి ఓడించి పుష్పకంతోపాటు లంకనే వశం చేసుకొన్నాడు. మరి అనరణ్యుణ్ణి వధించాడు. వేదవతిని బలాత్కరించ బోయాడు. యమ వరుణేంద్రాదులను బంధించాడు. కైలాసాన్నే కదిలించబోయాడు. వావి వరుసలు చూడకుండా రంభతోనే అన్యాయంగా వ్యవహారం సాగించాడు. . కడకు ఉన్మాదంతో కన్నుగానక తన చెల్లెలు శూర్పణఖ మగణ్ణి విద్యుజ్జిహ్వుడినే అంతమొందించాడు. ఇలా ఎన్నెన్నో దారుణ కృత్యాలు చేస్తూ రావటం చూస్తూనే ఉన్నాడు. అయితే ఎందుకు కలుగజేసుకోలేదు. అన్న అనే గౌరవమొకటి అడ్డు తగులుతున్న దాయనకు. అంతేగాక ఎన్ని బరాటాలు సాగించాడో అంత పరాభవాలకు కూడా పాలవుతూ వచ్చాడు రావణుడు. అనరణ్య వేదవతీ నలకూబర నందికేశ్వరులచేత ఘోరంగా శపింపబడ్డాడు. బలిచక్రవర్తి చేత చీవాట్లు తిన్నాడు. కైలాసాన్ని ఎత్తబోయి తలలూ చేతులూ చిత్తయిపోగా భీకరంగా కేకలు వేశాడు. కార్తవీర్యార్జునుజ్జీ కనలించి అతనిచేత కారాగృహంలో తోయించబడ్డాడు. వాలి చంకల క్రింద చేతులిరికించుకొని గిలగిలలాడాడు. తుదకు శ్వేత ద్వీపవాసినులైన మహిళల చేతులలో బడి ఒక బంతిలాగా అటూ ఇటూ గంతులు వేశాడు. ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడైనా తెలుసుకొని బాగుపడక పోతాడా అని ఉపేక్షిస్తూ వచ్చి ఉంటాడు బహుశా.
Page 249