ఇలాంటివెన్నో వరాలిస్తారు. ఈశ్వరుడాయనకు బ్రహ్మదండం కూడా పనిచేయదని అనుగ్రహిస్తాడు. బ్రహ్మకామరూప కామచారాదులనుగ్రహిస్తాడు. వీటన్నిటి ప్రభావంతో రాబోయే కాలంలో రామకార్యాన్ని సాధించి త్రిలోకాలలో కీర్తి పతాక ఎగురవేస్తాడని కూడా ఆశీర్వదిస్తాడు. పృథివ్యాకాశార్ణవాలలో సమస్త లోకాలలో అప్రతిహతమైన గమనం ప్రసాదించాడు. వర గర్వంతో రెచ్చిపోయి ఈ బాలుడాశ్రమవాసులైన మహర్షుల నల్లరి చేయసాగాడు వారు మరేమి చేయలేక శాపంగాని శాపమొకటి ఇచ్చారితనికి. అదే తన బలం తనకు తెలియకపోవటం. అందుకే సుగ్రీవుడి బాధలు చూచి కూడా వాలి మీద చేయి చేసుకోలేకపోయాడు. మరి ఒకరు తెలిపితే తెలుస్తుందా బలం. అందుకే జాంబవంతుడు ప్రోత్సహిస్తే సముద్రాన్ని లంఘించగలిగాడు. అయితే జాంబవంతుడంతకు ముందునుంచీ ఉన్నాడు కదా ఎందుకు ప్రోత్సహించలేదు వాలి వధకు అని ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఉంది రహస్యం. విధి విధానమది. వాలినతడు చంపకూడదు. చంపితే రామావతారానికి ప్రయోజనంలేదు. ఇదంతా భగవానుడైన రాముడికీ తెలుసు. భగవద్భక్తుడైన హనుమంతుడికీ తెలుసు.
అసలెవడీ హనుమంతుడు. నిజమాలోచిస్తే గరుత్మంతుడే హనుమంతుడు. శంఖ చక్రాలు భరతశత్రుఘ్నులై అవతరిస్తే విష్ణువాహనమైన గరుత్మంతుడే హనుమంతుడై స్వామి వారిని సేవించాడు. వినీత వదుపాగమ్య అని మొదట చెప్పటంలో వినతా నందనుడనే అర్ధం సూచించాడు మహాకవి. అక్కడక్కడ వైనతేయ నమో జవే అనే ఉపమానవాక్యాలలో కూడా ఈ భావమే ధ్వనింపజేశాడు. ఆకాశ గమనం కూడా ఈ అర్ధాన్నే బలపరుస్తుంది. అంతేకాదు. సీతా మాత భూలోకంలో పాతాళంలో ఎక్కడా కనపడకుంటే ఆఖరుకు స్వర్గానికైనా ఎగిరిపోయి అక్కడ దేవేంద్రుడి అధీనంలో ఉన్న అమృత కలశాన్నైనా తేగలనని వానరుల ఎదుట అతడు ప్రతిజ్ఞ చేయటంలో కూడా గరుత్మంతుడి లక్షణం కంఠోక్తిగానే చెప్పినట్టయింది. అసలు రాముడే అంటాడొకచోట వైనతేయుడి కొక్కడికి తక్క నీ జవసత్త్వాలు మరెవరికీ లేవని. రామలక్ష్మణులను మోసుకుపోవటంలోనూ సీతామాతను కూడా పృష్ఠ మారోహ నా వీపుమీద కూచోవమ్మా రామ సన్నిధిని చేరుస్తాననటంలోనూ ఈ రహస్యమే వెల్లడించాడు. గరుత్మంతుడంటే రెక్కలుగలవాడని శబ్దార్థం. ఆ రెక్కలేవో
Page 244