లేదో తిరిగి వచ్చి లంకా నగరాన్ని రావణుడితో సహా పెకలించి తెచ్చి రాముడి ఎదుట పెడతానంటాడు. ఇది హనుమంతుడు కాదు. రామబాణం చేసేపని. అదే హనుమన్ముఖంగా మాట్లాడుతున్నది.
ఇక సముద్ర లంఘన సమయంలో ఎన్నో విఘ్నాలు. సురస సింహిక ఇలాంటి అద్భుతాలెన్నో అన్నిటిలోనూ మొదట రామకార్యార్థం వెళ్లుతున్నాను. నన్నడ్డగించకండి అని సౌమ్యంగా చెప్పటం వినక మొండికి పడితే ఆ రామనామ ప్రభావంతోనే వాటిని నిగ్రహించటం. మధ్యలో మైనాకుడు పాపం ఆతిధ్యం చేద్దామని పైకిలేస్తాడు. ఇక్ష్వాకుల కెంతో ఋణపడిన సముద్రుడా ఇక్ష్వాకు వంశజాతుడైన రాముడి దూతకు సత్కారం చేయమని నన్ను పంపాడంటాడు. అయినా రామకార్యార్థం వెళ్లుతున్నాను. తరువాత వచ్చి విశ్రమిస్తానని చెప్పి హడావుడిగా సాగిపోతాడు. రామకార్య నిర్వహణ దృష్టి ఎంత తీవ్రమైనదో చూడండి ఆ రామభక్తుడికి. లంకిణిని వధించాడు. లంకలో ప్రవేశించాడు. “యత్కించ జగత్యాంజగత్" అన్నట్టు అంగుళ మంగుళమూ వెతికాడా పట్టణంలో. ఉద్యానాలు, అంతఃపురాలు అన్నీ గాలించాడు సీతకోసం. ఎక్కడా కనపడలేదా మహాతల్లి. మందోదరి సౌందర్యం చూచి ఆవిడేనని భ్రమించాడు. మరలా తన తప్పు తానే సరిదిద్దుకొన్నాడు. ఇంతమంది ఆడువారిని నిద్రలో అడ్డదిడ్డంగా పడి ఉన్నవారినంతగా పరకాయించి చూస్తున్నానే ఇది పాతకంగాదా అని బాధపడ్డాడు. అయినా నాకు వీరియందెలాంటి దురుద్దేశం లేదుగదా. మనోవృత్తే గదా దేనికైనా ప్రమాణం. అది పరిశుద్ధంగా ఉన్నప్పుడు భయమెందుకని సమాధానం చెప్పుకొన్నాడు. ఇంతకూ స్వామి కార్యం సాధించలేక పోయానే దేనికీ జీవితమని ప్రాణత్యాగం చేయటానికి సిద్ధమయ్యాడు. అయినా నిరుత్సాహపడి సాధించేదేమిటి? వినాశే బహవో దోషా - జీవనభద్రాణి పశ్యతి. బ్రతికే సాధించాలేదైనా-అని ఇలా ఎన్నెన్ని పోకడలు పోవాలో ఆ మనస్సు అన్నీ పోయింది. హనుమంతుడి భావశుద్ధి కార్యదీక్ష ఆశావాదము ఇలాంటి ఉదాత్త గుణాలన్నీ తార్కాణమవుతా యిందులో.
సీతతో ఆ తరువాత ఆయన చేసిన సంవాదము, ఆమెకు నమ్మకం కలిగించటానికి మాటలలో చూపిన నైపుణ్యము, వినయ వివేకములు ఇంతా అంతా కావు. తన రాక తెలపటానికి రావణ సైన్యాన్ని తుదకు అక్షయ కుమారుడితో సహా రూపుమాపటంలో వనభంగం చేయటంలో అతని అసహాయ శూరత ఎట్టిదో రాక్షస
Page 239