#


Index

హనుమ ద్విభీషణులు

వరాఙ్ముఖుడు కాబట్టి పనికిరాడు. సుగ్రీవుడు కర్తవ్యజ్ఞుడైనా అంత సమర్థుడు కాడు కాబట్టి పనికిరాడు. తతిమా వానరులు అసలే కొఱగారు. పోతే ధీమంతుడు, పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు ఒక్క హనుమంతుడే. కనుక అతడొక్కడే కార్యసాధకుడని నిర్ణయించాడు. కనుకనే సీతాన్వేషణార్థమాయా దిక్కులకు వానర సైనికులనంతా సుగ్రీవుడనుపుతుంటే దక్షిణ దిక్కుకు పయనమైన హనుమంతుణ్ణి దగ్గరకు పిలిచి అతడికే తన ముద్రికను ప్రసాదించాడు. దక్షిణ దిశాభిముఖంగా వెళ్లే సైన్యాని కధిపతి అసలు హనుమంతుడు కాడు. వాలి నందనుడైన అంగదుడు. అతణ్ణి కాదని హనుమకు తన అంగుళీయక మిచ్చాడంటే ఎంత నమ్మకముండాలి అతనిమీద. అది హనుమంతుణ్ణి చూచినప్పటినుంచీ అక్కడ పరిస్థితులను బట్టి అంచనా వేస్తూనే వచ్చాడు పరమాత్మ. తన్ను చూచి సుగ్రీవాది వానరులంతా హడలిపోతుంటే అతడలా హడలిపోక వారందరినీ మందలించటం చూచాడు. తనవద్ద కతడు మాత్రమే కామరూపంతో రావటం చూచాడు. అతని మాట తీరూ వ్యవహారము కనిపెట్టాడు. తమ అన్నదమ్ములనిద్దరినీ మోసుకొని పోయే సామర్ధ్యము, సుగ్రీవుడితో మైత్రి చేయించిన సౌజన్యము గ్రహించాడు.

  అన్నిటికన్నా విశేషమైనది అతని పరావరజ్ఞానం బాగా ఆకర్షించింది స్వామి వారిని. వాలి వధానంతరమతని కళేబరాన్ని కౌగిలించుకొని తార ఆక్రందనం చేస్తుంటే ఆవిడకు వేదాంతబోధ చేస్తాడు హనుమంతుడు. గుణదోషకృతం జంతుః స్వకర్మఫల హేతుకం అన్యత్రత దవాప్నోతిసర్వం ప్రేత్యశుభాశుభమ్ - శోచ్యాశోచసికంశోచ్యం-దీనం దీనాను కంపసే కస్యకోవానుశోచ్యోస్తి - దేహేస్మిన్ బుద్బుదోపమే జానాస్యనియతా మేవంభూతానా మాగతింగతిం తస్మాచ్ఛుభంహికర్తవ్యం పండితేనై హలౌకికమ్ యస్మిన్హారి సహస్రాణి - ప్రయుతాన్యయుతానిచ - వర్తయంతి కృతాంశాని సోయందిష్టాంతమాగతః - గతోధర్మజితాంభూమిం-నైనంశోచితుమర్హసి సంస్కారోహరిరాజస్య - అంగదశ్చాభిషిచ్యతామ్ - సింహాసనగతం పుత్రం పశ్యంతీ శాంతి మేష్యసి - ఎందుకమ్మా విలపిస్తావు. ఎవరి మంచి చెడ్డలకు తగిన ఫలం వారనుభవిస్తున్నారు. ఇహంలో చేసింది పరంలో అనుభవానికి రాక తప్పదు. నీవు శోచనీయవై మరొకరిని గూర్చి శోకించుటమేమిటి ? ప్రాణుల రాకపోక లెలాంటివో చూస్తున్నావు గదా. జీవితమెంత క్షణభంగురమో అదీ చూచావు గదా.

Page 234

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు