గ్రహించాలా ? ఎప్పటినుంచో తెలుసు ఆ భక్తుడి శక్తి యుక్తులాస్వామికి. కేవలమొక నాటక మీ సన్నివేశం. ఇలాంటి వాడుంటే ఏ పని నెరవేరదనటంకూడా భావ్యార్థసూచనమే. సుగ్రీవుడితోకాదు తనకు ప్రయోజనం. వాస్తవానికి హనుమంతుడితోనే అని ధ్వని. తానుగా మాట్లాడక లక్ష్మణుడిచేత మాట్లాడించటం కూడా ధూర్తత్వమే. నాకు తెలుసు నీతడెవడో. నీవే తెలుసుకోవలసి ఉందని చెప్పటమే.
తరువాత వనగమన వృత్తాంతమంతా లక్ష్మణుడు చెప్పగా విని ఇక సందేహంలేదీ ప్రభువు మన ప్రభువేనని నిర్ధారణ చేసుకొంటాడా భక్తశిఖామణి. వెంటనే భిక్షురూపం వదిలేసి తన ఎప్పటి వానరరూపమే ధరిస్తాడు. అన్నదమ్ముల నిద్దరినీ తనమూపుమీద కూచోబెట్టుకుని వాయువేగంతో సుగ్రీవుడి దగ్గరికి మోసుకొని పోతాడు. భగవత్సేవ ఇక్కడి నుంచే ఆరంభమవుతుంది. ఎన్నాళ్లనుంచి ఎదురు చూస్తున్నాడో ఆయన రాక ఆ మహాభక్తుడు. ఇప్పటికి తన తపస్సు ఫలించింది. స్వామిదర్శనమయింది. భాషణమయింది. స్పర్శనమయింది. స్వామి సేవ కుపయోగపడటమే తన జన్మకు సాఫల్యమని భావించాడు. అసలా మాటకు వస్తే ఋక్ష వానర గోలాంగూలాదులన్నీ అందుకోసం జన్మించినవారే. స్వామికోసమే వారి జన్మ. తమకోసం గాదు. ఎవరీ వానరులంటే దేవతలేగదా. దేవతలంతా కలిసి ప్రార్థిస్తే గదా దేవదేవుడు రాముడై అవతరించాడు. ఆయనకా దానవ సంహరణోద్యమంలో తోడుపడాలనే గదా వాలి సుగ్రీవాది వానర రూపాలలో ఆయా దేవతలంతా జన్మించారు. అయితే అలా జన్మించి కూడా తన జన్మరహస్యాన్ని తమ కర్తవ్యాన్ని విస్మరించారు వాలి ప్రభృతి వానరులు. సాధువర్తనుడైన సుగ్రీవుణ్ణి తరిమివేశాడు వాలి. ఎప్పటికైనా పరమాత్మ ఆ సాధువు దగ్గరికే వస్తాడని గ్రహించి ఉంటాడు బుద్ధిమంతుడైన హనుమంతుడు. అందుకేనేమో వాలిని కాదని త్రోసిపుచ్చి అతని తమ్ముడు సుగ్రీవుడి కొలువులో చేరాడు. అతడికి బాసటగా నిలిచాడు. మహాబలనందనుడూ మహాబలసంపన్నుడూ అయి కూడా వాలిమీద అప్పట్లో చేయిచేసుకోలేదు. పరమాత్మే ఎప్పటికైనా వచ్చి ఆ పని స్వయంగా చేస్తాడని తెలిసి ఉంటుందా మహాపురుషుడికి.
అతని బుద్ధికుశలతను బాగా కనిపెట్టాడు శ్రీరామచంద్రుడు. తనకన్నివిధాల పనికివచ్చే వాడతడేనని తెలుసు ఆయనకు. వాలి బలశాలి అయినా కర్తవ్య
Page 233