#


Index

హనుమ ద్విభీషణులు

పరిమార్గణే. సీతాన్వేషణం చేయటంలో నీకు తోడ్పడతాడని చెప్పిన సుగ్రీవుడు హనుమంతుడుగానే సాక్షాత్కరించాడు. కనుకనే భగవంతుడి దృష్టి ప్రథమంగా హనుమంతుడి విగ్రహం మీదనే పడింది. పడటమేగాదు. ప్రహృష్టవదనః శ్రీమాన్ ఆనందంతో ముఖం విప్పారింది. సచివోయం కపీంద్రస్య - సుగ్రీవస్య తమేవ కాంక్షమాణస్య మామాంతికముపాగతః చూచావా లక్ష్మణా ! సుగ్రీవుడి అమాత్యుడితడు. నేను సుగ్రీవుణ్ణి చూడాలనుకొంటూ ఉంటే ఇతడు దగ్గరకు వచ్చి కనిపించాడు అంటాడు లక్ష్మణుడితో నిజంగా చూడాలనుకొన్నది సుగ్రీవుణ్ణా కాదు. సుగ్రీవసచివుడైన హనుమంతుణ్ణి పరమాత్మ. పరమాత్మకు దగ్గరగా రావటానికి ఆయన దర్శనం చేసుకోవటానికి ఎవరికున్నది హక్కు పరమభక్తుడు హనుమంతుడికి దక్క అది అంతర్యామిరూపుడైన రాముడికి తెలుసు. తెలిసే అలా మాట్లాడాడు.

  ఆ మాటకు వస్తే హనుమంతుడికి కూడా తెలుసు అంతరాంతరంలో. తెలియకపోతే ఒక్కమాట. రాముణ్ణి దూరంగా నడచి వస్తుంటే ఆయన వేషభాషలూ, ధనుర్బాణాలూ ఇలాంటి వాలకంచూచి అతడెవడో వాలి పంపిన గూఢచారి అయి ఉంటాడని సుగ్రీవుడూ హడలిపోయాడు. అక్కడ ఉన్న వానరులూ అదరిపోయారు. అందరూ బెదిరినా హనుమంతుడు మాత్రం భయపడలేదు. పైగా సుగ్రీవుడితో సహా అందరినీ చీవాట్లు పెడతాడు. సంభ్రమస్త్యజ్యతామేష - సర్వైర్వాలి కృతేమహాన్. వాలి వాలి అంటారేమిటి ? ఎక్కడున్నాడు వాలి. మీకెక్కడ కనిపిస్తున్నాడు. నేహపశ్యామి వాలినమ్. మీరు భయంకరుడని భావించే వాలి నాకెక్కడా కనిపించటంలేదే. అహోశాఖామృగత్వం తేవ్యక్తమేవ - లఘుచిత్త తయాత్మానం నస్థాపయసి అయ్యో సుగ్రీవా! శాఖామృగ మనిపించుకొన్నావు గదయ్యా మనసు నెందుకింత తేలిక చేసుకొని బెంబేలు పడుతున్నావని మందలిస్తాడు చూడండి. నలుగురికీ రాముడు వాలిలాగా భయంకరంగా కనిపిస్తే హనుమంతుడికి తానెప్పుడూ మనసులో ఆరాధించే స్వామిలాగానే దర్శనమిచ్చాడు. శాఖామృగమైనా శాఖా మృగత్వం లేదాయనలో. లఘుచిత్తత అంతకన్నా లేదు. అది అతని ప్రక్కనున్న వానరులకే. అతనికిగాదు. దీనికి నిదర్శనమొక్కటే. వారు వాలి పంపిన చారులేమో విచారించి రమ్మని సుగ్రీవుడు పంపితే వానరవేషం మార్చి సన్న్యాసివేషం వేసుకొని వెళ్లుతాడు వారిదగ్గరికి. వెళ్లినవాడు వినయంతో వారికే నమస్కరిస్తాడు. ఏమిటీ

Page 231

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు