#


Index

హనుమ ద్విభీషణులు

  ఇది సర్వజ్ఞుడైన రామచంద్రమూర్తికి బాగా ఎఱుక. అందుకే ఆయన మధ్యలో తారసిల్లినా వారితో ఎంత కాలంనుంచో పరిచయమున్న వారితో మాదిరే వ్యవహరిస్తాడు. భరతలక్ష్మణుల మాదిరే చూస్తాడు. ఆదరిస్తాడు. మొదట హనుమంతుడి విషయమే తీసుకొని చూతాము. రామాయణంలో ఈ పాత్రను ప్రవేశపెట్టింది వాల్మీకి ఎక్కడో కిష్కింధాకాండలో. అప్పటికి బాల, అయోధ్య, అరణ్య మూడుకాండలు గడిచాయి కథలో. అంతవరకూ హనుమంతుడంటే ఎవరో తెలియదు మనకు. కథానాయకుడైన రాముడికే తెలియదు. తెలియదంటే దశరథ రాముడికి తెలియకపోవచ్చు గాని ఆధ్యాత్మ రాముడికెప్పటినుంచో తెలుసు హనుమంతుని ఉదంతం. తెలిసినా తెలియనట్టు నటించాడనే అనుకోవాలి మనం. ఈ నటించటం ఆ స్వామేకాదు. ఆ స్వామి భక్తుడు కూడా అలాగే నటిస్తూ వచ్చాడా అనిపిస్తుంది.

  చూడండి. కిష్కింధలో మొదటిసారి తటస్థపడ్డారిద్దరూ. అంతవరకొకరి నొకరు చూడలేదు చేయలేదు. కొత్త ముఖాలొకరి కొకరు. రాముడు సీతావియోగానల దందహ్యమానుడయి తట్టుకోలేక ఆ చెట్టూ ఈ పుట్టా తిరుగుతూ ఋశ్యమూక పరిసరాలకు 'వచ్చాడు. ఆ రావటం యాదృచ్ఛికమే. మహా అయితే కబంధుడు సలహా ఇచ్చాడాయనకు సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళమని కొంతదూరం నడిచి వెళ్లితే పంపా సరోవరం వస్తుంది. దాని కనతిదూరంలో ఋశ్యమూకమనే పర్వతం కనిపిస్తుంది. అక్కడ సుగ్రీవుడనే వానరరాజు నలుగురు వానరోత్తములతో కలిసి మెలగుతుంటాడు. అతడు నీకు తప్పక సహాయం చేయగలడు వెళ్లమంటాడు. ఆ మాట పట్టుకొని అక్కడికి వస్తాడు రాముడు. దారిలో లక్ష్మణుడితో సుగ్రీవుణ్ణి చూడాలని మనసు తొందర పడుతున్నది. సీతాన్వేషణాని కతడు మనకు బాగా తోడ్పడగలడని చెబుతూ వస్తాడు. కబంధుడు తనకు చెప్పిందీ తాను లక్ష్మణుడితో అంటూ వచ్చిందీ సుగ్రీవుడని పేరేగాని రాముడి మనసులో ఉన్నది సుగ్రీవుని మూర్తిగాదు. హనుమంతుని మూర్తే. కనుకనే ఋశ్యమూకం దగ్గరికి వచ్చి కూడా సుగ్రీవుడు చూచాడేగాని రాముణ్ణి. రాముడు సుగ్రీవుణ్ణి చూడలేదు. రాముడి కంటబడిన వానరోత్తముడు ప్రప్రధమంగా హనుమంతుడే. సత్యసంధోవినీతశ్చ -ధృతిమాన్ మతిమాన్ మహాన్ అని కబంధుడు వర్ణించిన సుగ్రీవుడి లక్షణాలన్నీ హనుమంతుడిలోనే దర్శించాడా స్వామి. సతే సహాయోమిత్రంచ సీతాయాః

Page 230

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు