హనుమద్విభీషణులు
రామపరివారంలో భరత లక్ష్మణ పాత్రలను ముందుగా పరిశీలించాము. పోతే హనుమద్విభీషణ పాత్రలనిప్పుడు పరామర్శించవలసి ఉన్నది. భరత లక్ష్మణులకూ వీరికీ ఒక తేడాఉంది. అదేమిటంటే వారిద్దరూ రాముని కుటుంబ సభ్యులు. ఆయనకు సాక్షాత్తు సహోదరులు. మరి వీరిద్దరూ అలాంటివారు కారు. మధ్యలో యాదృచ్ఛికంగా వచ్చి కలిసిన ఆగంతకులు. పైగా వారిద్దరూ మొదటినుంచీ రాముణ్ణి సేవిస్తూ రాముడికోసమే జీవిస్తున్నవారు. తమకొక ప్రయోజనమంటూ వేరేలేదు వారికి. పోతే వీరిద్దరూ అలాకాదు. అంతవరకూ తమ బ్రతుకు తామువేరుగా సాగిస్తూ మధ్యలో ఏదో అక్కరకొద్దీ వచ్చి ఆయన నాశ్రయించినవారు. వీరికి ఒక స్వప్రయోజనమంటూ ఉంది. అంతేకాదు అన్నిటికన్నా పెద్దతేడా ఏమంటే వారు మానవ రూపాలతో మానవావతారమెత్తిన పరమాత్మకు సహాయంగా జన్మించారు. మరి వీరో, పరమాత్మకు సహాయంగానే జన్మించారుగాని మానవులుకారు. ఒకరు వానరుడు. మరి ఒకరు దానవుడు.
కాని చిత్రమేమంటే భరత లక్ష్మణులెంత ఆప్తులో హనుమద్విభీషణులూ అంత ఆప్తులే రాముడికి. వారు స్వకీయులనీ వీరు పరకీయులనీ భేదం లేదాయనకు. ఇద్దరు స్వకీయులే ఆప్తులే. అయినా పరమాత్మ కాప్తులేమిటి అనాప్తులేమిటి. సగుణుడనుకొంటే అందరూ ఆప్తులే. నిర్గుణుడైతే ఎవరూ కారాప్తులాయనకు. వీరంతా నిరుపాధికమైన ఆ తత్త్వానికి కేవల ముపాధులుగా జన్మించినవారే. అందరూ రామ కార్యార్థం జన్మించినవారే. అందులో కొందరాయన కుటుంబంలో సభ్యులుగా జన్మిస్తే మరికొందరు పరాయి వంశాలలో జన్మించారు. కొందరు మనుష్యోపాధిలో అయితే మరికొందరు మనుష్యేతరమైన వానరాద్యుపాధులలో అవతరించారు. అవి ఆయా ఉపాధులవరకే పరిమితం. పై ఉపాధులెలాంటిపై తేనేమి. లోపల దాగి ఉన్న జీవ సంస్కారంవేరు. వానరుడైనా వానర స్వభావుడు కాడు హనుమంతుడు. దానవుడైనా దానవ స్వభావుడుకాడు విభీషణుడు.
Page 229