కృతుడు రాముడైతే యజ్ఞనిర్వాహకులైన ఋత్విక్కులొకడు భరతుడు. మరొకడు లక్ష్మణుడు. అందరిలో భరతుడు మనోరూపుడు కాబట్టి బ్రహ్మ. లక్ష్మణుడు ప్రాణరూపుడు కాబట్టి హోత.
ఇక్కడ ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది ఈ పాత్రల సృష్టిలో. నిష్కలం నిష్క్రియం శాంతమన్నట్టు పరమాత్మ అసలు నిష్కలుడు, నిష్క్రియుడు, నిష్కలమైన అదే సృష్టి కున్ముఖమయ్యేసరికి సకలమయింది. ఆ కళలలో మొదటిది ప్రాణం. రెండవది మనస్సు. అవే భరత లక్ష్మణులని పేర్కొన్నాము. వాటి ప్రయోజనం క్రియ. దానితో అవి సక్రియమయినాయి. ప్రయోజనం తీరగానే క్రియ నిష్క్రియమై సకలం మరలా నిష్కలంగా నిలిచిపోవాలి. అందులో మొదట ప్రాణశక్తిని తనలో లయం చేసుకొన్నాడు పరమాత్మ. అదే లక్ష్మణ నిష్కాసనం. పిమ్మట సంకల్పశక్తితో కొన్ని దినాలున్నాడు. సత్యసంకల్పం కదా అది. తన ఇచ్ఛాశక్తి అది. అది లయం కావటం తన ఇచ్చను బట్టి ఉంటుంది. అందుకే లక్ష్మణుడు వెళ్లిపోయినా భరతుడింకా కొంత కాలముండి అనంతరం రాముడితోనే సరయువులో అంతర్థానమయినాడు. ఇదికూడా వీరిరువురి పాత్రలలో ఇమిడి ఉన్న ఒక భావచిత్రమే.
Page 228