#


Index

భరత లక్షణులు

భావం. కంటి రెప్పలాగా అనుక్షణమూ ఆయనను కాపాడుతూ వచ్చాడు. ప్రాణశక్తి గనుకనే ఆయన మీద ఈగవాలనీయడు లక్ష్మణుడు. పరమాత్మ కార్యాని కెవరడ్డు తగిలినా విఘాతం కలిగించినా ఎంత మాత్రమూ సహించడు. క్షమించడు. వారు తండ్రి అయినా సరే. తల్లి అయినా సరే కొడతాను చంపుతానని పైకిలేస్తాడు. అంతకోపోద్రేక మతనిది. శేషావతారం కదా మరి. దాని స్వభావమెక్కడికి పోతుంది. కస్సుమని లేవటం కాటు వేయటమే దాని లక్షణం. అలాంటి లక్షణమే లక్ష్మణుడిది కూడా. ఇది వాల్మీకి అక్కడక్కడ మనకు సూచన చేస్తూనే వస్తాడు. లక్ష్మణుడికెప్పుడు కోపం వచ్చినా నిశశ్వాసమహాసర్పో - బిలస్థ ఇవరోషితః వల్మీకంలో ఉన్న ఒక మహాసర్పం బుస కొడుతూ పైకి లేచినట్టు దట్టంగా నిట్టూరుస్తున్నాడని వర్ణిస్తాడు. నిజానికి మహాసర్పమేకదా ఆయన. ఆయన నిశ్శ్వాసమది సర్పనిశ్శ్వాసమే. రాముడికీషత్తు అపకారం చేశారని తెలిస్తే చాలు, అలా బుసలు కొడుతూ పైన దూకటమే. కరవరావటమే. మరొక మాటలేదు. దశరథుడు ఎంత చెడ్డా తండ్రి. అతడు కైక మాట విని జ్యేష్ఠుడైన రాముడికి రాజ్యమివ్వలేదు. ఇవ్వకపోగా అరణ్యవాసాని కాజ్ఞాపించాడు. అందుకు రాముడెలాగూ అంగీకరించాడు. తనకు దేనికంత ఉద్రేకం. ఉక్కు రోషం. తన వ్యవహారం కాదుగదా అది అయినా కోపం వచ్చింది లక్ష్మణుడికి. కనుబొమలు ముడివడ్డాయి. సింహంలాగా భయంకరమైన ముఖం పెట్టాడు. చేతులు బారలుచాస్తూ తల విసురుతూ అన్నను చూచి 'ప్రోత్సాహితో యమ్ కైకేయ్యా - నదుష్టోయదినః పితా - అమిత్ర భూతోనిస్సంగం - బధ్యతాం వధ్యతామయమ్ గురోరప్యవలిప్తస్య - కార్యాకార్యమజానతః -ఉత్పథం ప్రతిపన్నస్య కార్యంభవతి శాసనమ్'- ఎంత పెద్దవాడైనా సరే. తండ్రి అయినా సరే. గర్వంతో కన్నుగానక మంచి చెడ్డలు గుర్తించక దుర్మార్గానికొడిగడితే దండించవలసిందే. కైక మాటలు విని నిన్ను కానలకు పంపాడంటే అతడు తండ్రికాదు. తండ్రిపేరుతో బ్రతికే గర్భశత్రువు. అతణ్ణి వెంటనే పట్టి వధించవలసిందే మనం అంటాడు. భరతుడు తమ తల్లిని బాగా చూస్తాడో లేదోనని రాముడనుమానిస్తుంటే అలా చూడకపోయాడో తమహందుర్మతింక్రూరం - వధిష్యామి నసంశయః ఆ దుర్బుద్ధినీ దురాత్ముణ్ణి నేను వధిస్తాను సందేహించ వద్దంటాడు. ప్రతివాళ్లనూ వధించటమే. అంతకన్నా తక్కువ మాట ఎరగడా మహానుభావుడు. పాపం భరతుడన్న గారిని వెనుకకు తీసుకెళ్ళాలని అరణ్యానికివస్తే ఆ ధర్మనిరతుణ్ణి వధిస్తానని మరలా పైకి లేస్తాడే.

Page 222

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు