#


Index


కవి మాహాత్మ్యము

చూచాడా మహర్షి. వెంటనే ఆగ్రహోదగ్రుడై అతణ్ణి శపిస్తూ అప్రయత్నంగా ఒక శ్లోకమే ఉచ్ఛరించాడు. ఉచ్ఛరించాడంటే అప్పుడతనికి తన గత జీవితమే జ్ఞాపకం వచ్చి ఉంటుంది. కనుకనే తాత్కాలికమైన ఉద్రిక్తతను అంతగా పొందగలిగాడు. ఛీ అని రోత పుట్టిగదా తన కిరాతవృత్తి తాను మానివేశాడు. అలాంటి వృత్తి మరలా మరి ఒకడిలో కనిపించేసరికి అయ్యో మరలా ఆదారుణమే చూడవలసి వుందే అని బాధపడి ఉండవచ్చు. పోతే రామాయణ కథా నిర్మాణంలో కూడా ఆయన గుహుడి, శబరి లాంటి పాత్రలను సృష్టించటంలో కూడా తన గత జీవిత స్మృతులు తొంగి చూస్తున్నాయా అని భావించవచ్చు. నీచకులంలో పుట్టి ఏ చదువు, సంస్కారమూ లేకపోయినా పెద్దల సాహచర్యంతో ఉత్తమమైన చిత్త సంస్కారం పొంది రామ సందర్శనం చేసి తరించినట్టే గదా ఈ కథలనాయన వర్ణించాడు. ఇందులో తన జీవితాన్ని తాను అన్యాపదేశంగా వర్ణించినా వర్ణించి ఉండవచ్చు.

  మొత్తంమీద వాల్మీకిని గూర్చిన ఈ ఆభాణకం కేవలమవాస్తవమని మనం పట్టు పట్టి కొట్టివేయవలసిన పనిలేదు. వాస్తవమనుకొన్నా మధురంగానే ఉన్నదిది. ఎంత మధురమంటే అది ఈనాటి బోయలు కూడా మాది వాల్మీకి కులమని సాభిమానంగా చెప్పుకుంటున్నారు. కడకు కసాయి బోయ ఒక మహనీయమైన ప్రతిష్ఠ పొందాడంటే “అసతోమా సద్గమయ” అన్ననుడి సార్థకమవుతున్నది. ఎవ్వడేగాని జన్మతః దుర్జనుడు కాడు. సజ్జనుడుకాడు. గుణకర్మలను బట్టే మానావమానాలు లభిస్తున్నాయి లోకంలో. అది పూర్వజన్మ సుకృతంవల్ల కొందరికి సహజంగా ఏర్పడితే మరికొందరికి జీవితంలో ఏదో ఒక నిమిత్తంవల్ల సంక్రమిస్తుంది. దానిని మరలా పెంపొందించుకోగలిగితే వాడే తరువాత మహాత్ముడవుతాడు. ఇలాంటి సందర్భాని కుదాహరణ ప్రాయమే ఈ కథ. పైగా మొదటినుంచీ మంచి అనిపించుకొని బ్రతికేవాడెప్పుడైనా చెడుమార్గాన్ని త్రొక్కే కక్కూర్తికి పాలుపడే అవకాశముంది. అదే మనం సత్యసంధులనుకొన్న ధర్మరాజాదులలో చూస్తున్న వ్యవహారం. పోతే మొదట జీవితంలో చెడు అనేది ఏదో పూర్తిగా చవిచూచి అనుభవించి విసుగు చెందినవాడి కొకసారి పరివర్తన కలిగితే చాలు. ఇకవాడు మరలా ఆ తెరువుకు పోడు. పశ్చాత్తప్తుడయి బాగుపడతాడు. ఎంతైనా ఎత్తుకు ఎదిగిపోతాడు. పునః పతనభయం లేదు వాడికి. ఇదికూడా ఈ కథలో ఒక ఆంతర్యమే.

Page 22

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు