కూడా ఉండబట్టే గుహుడన్నా తొణకలేదు. భరద్వాజుడన్నా భయపడలేదు. కచ్చిన్న తస్యాపాపస్య పాపంకర్తుమిహేచ్ఛసి అని నిష్టురంగా పలికిన భరద్వాజుడే జానేచై తన్మనస్థమ్-దృఢీకరణమస్త్వితి అపృచ్ఛంత్వాం తధాత్యర్ధం కీర్తింసమభివర్ధయన్ నాకంతా తెలుసు అయినా దృఢీకరించుకోవాలని తన్మూలంగా నీకు లోకంలో పేరు రావాలని, అలా మాట్లాడానులే అని ఒడ్డుకొంటాడు. అంతేకాదు. అప్పటికి భరతుడి చిత్తశుద్ధి ఎలాంటిదో చూడాలని లేదా నలుగురికీ చూపాలనీ ఉన్న దామహర్షికి. తపః ప్రభావంతో భరతుడికీ ఆయన పరివారానికి ఒక పెద్ద విందు చేస్తాడు. కోటలూ, పేటలూ, మేడలూ, మిద్దెలూ, తోటలూ, దొడ్లూ, రథాశ్వ గజశాలలూ, మణికనక వస్తువాహన మాల్యాలంకరణాదులూ, ఇష్టమృష్టాన్నాదులూ ఒకటేమిటి? సమస్త భోగాలూ ఒక్కక్షణంలో సాక్షాత్కరిస్తాయక్కడ. షడ్రసోపేతంగా కుత్తుకలబంటి భక్షించి చిత్తుగా మైరేయం సేవించి మత్తుగా పడిపోయారు సైనికులంతా. తత్రరాజాసనం దివ్యం, వ్యజనం, ఛత్రమేవచ, అప్పుడక్కడ ఒక దివ్యమైన రాజసింహాసనమూ, ఛత్రచామరాలూ అమర్చబడి ఉంటాయి. భరతుడా రాజపీఠానికి ప్రణామంచేసి రాముడి కభివాదనం గావించి వాలవ్యజనమాదాయ న్యషీదత్సచి వాసనే - ఛత్రచామరాలు పట్టుకొని దానికి ఉపచారం చేస్తూ ప్రక్కన ఉన్న అమాత్య పీఠంమీద ఆసీనుడవుతాడు. అక్కడకూడా అంత సమ్మోహన విద్య మహర్షి ప్రయోగించినప్పుడు కూడా ఎంత ఔచిత్యమో ఎంతటి అప్రమత్తతో చూడండి ఆ మహాపురుషుడికి.
భరద్వాజుడిలాగే లక్ష్మణుడు కూడా అనుమానించాడు. అనుమానించటమే కాదు. అనరాని మాటలన్నీ అన్నాడు. చివరకన్న గారి చీవాట్లతో తేరుకొన్నాడు. తప్పు గ్రహించాడు. సిగ్గుపడ్డాడు. అప్పటినుంచీ భరతుడంటే దేవుడే లక్ష్మణుడికి. చచ్చేదాకా ఒక పల్లెత్తుమాట అనలేదాయనను. అంతేకాదు. అరణ్యవాసం చేస్తూ ఒకమారు హేమంత ఋతుకాలంలో భరతుణ్ణి తలచుకొని రాముడితో త్వక్త్వారాజ్యం చమానం - భోగాంశ్చవివిధాన్ బహూన్ తపశ్చరతి ధర్మాత్మా - త్వద్భక్త్యా భరతఃపురే ఎంతో సుఖంగా బ్రతికినవాడు అపర రాత్రులలో సరయూనదిలో ఎలా మునుగుతున్నాడో, ధర్మజ్ఞుడు సత్యవాదీ జితేంద్రియుడు ప్రియభాషీ అన్నిటినీమించి ఆర్యం సర్వాత్మనాశ్రితః అని వేనోళ్ళ పొగుడుతాడు. అసలెవరైనా
Page 217