రామంసు రాజా యజ్ఞంను యక్షతే-ఇత్యహంకృతసంకల్పో-హృష్టోయాత్రా మయాసిషమ్. ఇంకా నాన్న రాముడి కభిషేకం చేస్తాడు. అశ్వమేధాది యజ్ఞాలు అనుష్టిస్తాడని ఉబలాడపడుతూ నేను యాత్ర వెళ్లానుగాని ఇలా జరుగుతుందని తెలిస్తే వెళ్లకనే పోదునని వాపోతాడు చూడండి. భరతుడి భ్రాతృప్రేమ. తల్లి తనకోసం రాముణ్ణి వెళ్లగొట్టాలని చూస్తే తాను రాముడికెప్పుడు పట్టాభిషేకం జరుగుతుందా అని కనిపెట్టుకొని ఉన్నాడు.
ప్రేమ అనేది భక్తి అనేది తెచ్చిపెట్టుకొనేది గాదు. అది ఒంటబుట్టాల్సిందే మానవుడికి. ప్రేమానురాగాదులున్న వాడికి స్వార్ధమనేది ఉండబోదు. ఎప్పటికప్పుడు తన సుఖాన్ని వదులుకొని ఇతరులకు మేలు చేయాలనే సన్నద్ధుడయి ఉంటాడు. మరొకరు చివరకు తల్లి అయినా సరే, తన ఆ త్యాగదీక్ష కేమాత్రం అడ్డు తగిలినా సహించలేడు. సహజంగా సౌజన్యమున్నవాడయినా తాత్కాలికంగా ఎక్కడలేని అక్కసు కలుగుతుందా మనసుకు. తండ్రి అకాలంగా ఎందుకు మరణించాడని అడిగి రామ వివాసనంవల్లనని ఆవిడ చెబితే మరీ పరితపిస్తాడు. ఏమి. రాముడేదైనా కాని పని చేశాడా అని అడుగుతాడు. అంటే వాడెంతవాడైనా తనకెంత పూజ్యుడైనా అధర్మపరుడైతే ఒప్పుకోడు భరతుడు. భరతుడి మనస్తత్త్వంలో ఇది మరొక గొప్ప లక్షణం. అదేదీకాదు. తనవల్లనే ఇదంతా జరిగిందని ఆవిడ చెప్పేసరికిక అగ్గిమీద గుగ్గిలంలాగా అయింది భరతుడికి తోక తొక్కిన తాచులాగా విరుచుపడతాడిక ఆవిడమీద. కులస్యత్వమభావాయ - కాళరాత్రిరివాగతా. ఈ రాజవంశ వినాశానికే నీవు కాళరాత్రివయి దాపురించావు. ఎందుకిలా చేశావు. రాముడు తన తల్లిపట్ల ఎట్లాగో అట్లాగే నీపట్ల నడచుకొనేవాడు కదా ! కౌసల్య నిన్ను తన సోదరిలాగే చూచుకొనేది గదా వారికెందుకింత ద్రోహం తలపెట్టావని అడుగుతాడు. చూడండి. రాముడి తరువాత భరతుడి కొక్కడికే ఉంది ఇలాంటి జ్ఞానం. రాజకుటుంబంలో ఎవరెలాంటి వారో ఎవరి అనుబంధా లెలాంటివో వారిరువురికి తెలిసినట్టెవరికీ తెలియదిక. నీవు పుత్రగర్ధినివి. నిన్నిప్పుడే పరిత్యజించగలను. అయినా నేనా సాహసమెందుకు చేయనంటే రాముడు నిన్ను తన తల్లిలాగా గౌరవిస్తుంటాడు. అందుకని నేను నిన్ను ఏమీ అనలేనంటాడు. ఎంత నిగ్రహమో చూడండి ఆ మనస్సుకు. లక్ష్మణ భరద్వాజాదులకే లేదీ నిగ్రహం. చంపదగిన అపరాధం చేసినా తల్లి అని గౌరవభావమొక ప్రక్కచోటు చేసుకొనే ఉందా సాధువు హృదయ కుహరంలో.
Page 215