#


Index

భరత లక్షణులు

ఎంతో భక్తి-అనురక్తి. దశరథుడి మరణవార్త మోసుకొని దూతలింకా తనవద్దకు వచ్చారో లేదో ? ముందురోజు రాత్రి దుఃస్వప్నం వచ్చిందని ఎంతగానో బాధపడతాడు. తండ్రికేమౌతుందోనని ఆందోళన చెందుతాడు. దూతలు రాగానే మొదట వేసిన ప్రశ్న కచ్చిత్సకుశలీరాజా-పితాదశరథోమమ నాతండ్రి దశరథ మహారాజు కుశలమా ? కచ్చిచ్చా రోగతా రామే-లక్ష్మణే. రామలక్ష్మణులకు క్షేమమేనా? ఆర్యాచధర్మ నిరతా - అరోగాచాపి కౌసల్యా రామమాత ధర్మపూత కౌసల్యకు సుఖమేనా. కచ్చిత్సుమిత్రా ధర్మజ్ఞా. ఆకరుకు సుమిత్రకు అనామయమేనా? అని ఇలా పెద్దలందరినీ పేరుపేరున పరామర్శిస్తాడు. చూడండి. తన తల్లి కైకను గురించి అడిగే ముందు కౌసల్యాదులను గురించే కుశలమడగటంలో ఆయన ఋజుబుద్ధి నిష్కల్మషత్వము ఎంత ఋజువవుతుందో గమనించండి. భరతు డమాయకుడు కాడు. ఎంత సజ్జనుడో అంత స్వభావజ్ఞుడు. ఎవరెలాంటివారో ఆయనకు కరతలామలకంగా తెలుసు. తల్లి అయిన మాత్రాన గొప్ప అని భావించడు. కనుకనే అందరినీ అడిగి చివరికిలా ప్రశ్నిస్తాడు వారిని. ఆత్మకామా సదాచండి క్రోధనా ప్రాజ్ఞమానినీ - అరోగాచాపిమేమాతా కైకేయీ కిమువాచహ ఎప్పుడూ తన విషయమే ఆలోచిస్తూ నా అంత ప్రజ్ఞాశాలిని లేదనుకొంటూ అసహనంతో బ్రతికే నా తల్లి క్షేమమేనా ? ఏమని చెప్పిందని అడుగుతాడు. చూడండి. ఈ మాటల్లో పూర్వోత్తరాల నెంతగా పసిగట్టి మాట్లాడినట్టుందో ఆ మహాత్ముడు.

  పరిస్థితులను బట్టి ముందుగానే పసిగట్టే స్వభావం భరతుడిది. అయోధ్యలో ప్రవేశించగానే అక్కడి దృశ్యాలన్నీ ఆయన అనుమానాన్ని బలపరుస్తూనే వచ్చాయి. బంధుజనుల కేమికీడు మూడిందోననే ఆయన ఆవేదన. రథం దిగి దిగగానే తండ్రి మందిరానికి వెళ్లి చూచాడు. తండ్రి అక్కడ కనపడక పోయేసరికి వెంటనే కైక ఇంటికి వెళ్లతాడు. ఏమి కౌసల్యాదుల ఇంటికి వెళ్లరాదా ? తెలుసు నతనికి అక్కడక్కడా ఉండడని. కైక ఆయనకు బాగా కావలసిందని. ఆమె ఏదో ఘనకార్యం చేసి కొంపదీసి ఉంటుందని పాడుపడ్డట్టున్న ఆ మందిరం చూడగానే భయపడి ఆమె కాళ్ళమీద పడ్డాడు. ఆమె కుశల ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చి తండ్రినిగూర్చి వాకబు చేశాడు. ఆయన మరణవార్త ఆమె నోట విని పపాతసహసా భూమౌ పితృశోక బలార్దితః నేలమీద వాలిపోతాడు. ఎంతో సేపటికి తల్లి ఓదార్చగా తెప్పరిల్లి లేచి అభిషేక్ష్యతి

Page 214

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు