రాఘవ స్నేహబంధమంటాడు వాల్మీకి. వెంటనే కిమిహాగమనేకార్యమ్ నీకు రాజ్యం లభించింది గదా చక్కగా ఏలుకోక ఎందుకిలా రావలసి వచ్చింది. నహిమే శుద్ధ్యతేమనః నా మనస్సుకేదో అనుమానంగా ఉందంటాడు. అంతేకాదు. గుణవంతుడయిన అన్నగారిని నిష్కారణంగా అడవులపాలు చేసింది చాలక 'కచ్చిన్నతస్యాపాపస్య పాపంకర్తుమి హేచ్ఛసి అకంటకం భోక్తుమనారాజ్యం' నిష్కంటకంగా రాజ్యం పాలించాలని ఆయనకేదైనా హాని తలపెట్టరాలేదు గదా అని నిలదీసి అడుగుతాడు. భరద్వాజుడిలాంటి ఋషీశ్వరుడే ఇలా శంకిస్తే ఇక ఏమీ తెలియని గుహుడి విషయం చెప్పేదేముంది. వాడు దూరం నుంచే చూస్తాడు భరతుడు సేనాసమేతంగా బయలుదేరి రావటం. చూడగానే అంటాడు తనవాళ్లతో. బంధయిష్యతివా దాశా- నధవాస్మాన్ వధిష్యతి - వీడు మనబెస్తలను బంధిస్తాడు. లేదా చంపనైనా చంపుతాడు. 'అథదాశరధింరామం పిత్రారాజ్యద్వివాసితం సంపన్నాం శ్రియమన్విచ్ఛన్ హంతుంతముపగచ్ఛతి' తండ్రిచేత వెళ్ళగొట్టబడి అడవులు పట్టి వచ్చిన రామచంద్రుని రాజ్యం చిరభోజ్యం చేసుకోవాలని వధించటానికైనా వచ్చి ఉంటాడు. అయితే ఒకమాట. మనమప్పుడే తొందరపడవద్దు. మనిషితో మాట్లాడి చూతాము. మంచివాడనిపించిందో సహాయం చేద్దాము. లేదా అతడి భరతంపడదామని కూడా అంటాడు. చూడబోతే చదువుకొన్న వాళ్ళకన్నా ఒక్కొక్కప్పుడు అంత చదువులేని పామరులే మేలనిపిస్తుంది. వాళ్లలో డొంక తిరుగుడు వ్యవహారం అంతగా ఉండబోదు. లక్ష్మణుడి కన్నా భరద్వాజుడు నయమైతే భరద్వాజుడి కన్నా గుహుడు మేలనిపించాడు.
ఇలా ఎదురైన ప్రతివారు భరతుణ్ణి అనుమానిస్తూ వచ్చారేగాని ఆయన మనః ప్రసాదాన్ని ఆర్జవాన్ని ఎవరూ అర్ధం చేసుకోలేదు. ఆఖరుకు తల్లిదండ్రులకే అర్ధం కాలేదు. దశరథుడూ అనుమానించినవాడే. కౌసల్యా అనుమానించిందే. రాముడి అభిషేకానికేమి భంగం కలిగిస్తాడోనని దశరథుడు భయపడితే రామ ప్రవ్రాజనానంతరం తనకేమి ముప్పు తెస్తాడోనని కౌసల్య హడలిపోతుంది. అయితే వీరంతా ఇలా మల్లగుల్లాలు పడవలసిందే గాని భరతుడిలో ఎలాంటి భావవికారము లేదు. ఎలాంటి పరిస్థితులలోనూ ఎవరికి ద్రోహం తలపెట్టినవాడు కాడు. అతని మనసే అంత నిర్మలమైన మనస్సు. తండ్రి-తల్లి భయపడుతున్నా అతనికి వారంటే
Page 213