ఒక మనస్వి అయిన సజ్జనుడి విషయంలో లోకమిలాగే అనుమానిస్తుంది. భయపడుతుంటుంది. ఇదే మానవులలోని ఒక విచిత్ర స్వభావం. కన్నకుమారుల్లైనా కట్టుకొన్న భార్యనైనా సరే. తమ దృష్టితోనే చూచి అంచనా వేస్తారు. తమ అంచనాకు సరిపడకపోతే చాలు అనుమానిస్తారు. అయితే మానవులకే గాని ఈ జాడ్యం మానవాతీతుడైన భగవానుడికెలాంటి భయాందోళనలు లేవు. రాముడు భగవత్స్వరూపుడే గనుక తండ్రి అనుమానించినా ఆయన అనుమానించడు. పైగా తల్లి దగ్గరికి వెళ్లి నాన్న నాకు రాజ్యమిస్తాడట. రేపే నేను రాజవుతాను సుమా ! అని హేళనగా మాట్లాడుతాడు. కైక భరతుడికే రాజ్యమిమ్మని కోరానని చెబితే రాముడెలాంటి మాట అన్నాడో చూడండి. అహంహిసీతాంరాజ్యం-ప్రాణానిష్టాన్ ధనానిచ-హృష్టోభ్రాత్రే స్వయం దద్యాం - భరతాయా ప్రచోదితః కింపునర్మనుజేంద్రేణ స్వయం పిత్రాప్రచోదితః అమ్మా తమ్ముడు భరతుడి కోసం నేను సీతనైనా సరే. నా ప్రాణాలనైనా సరే. ఏదైనా స్వయంగానే త్యాగం చేయగలను. ఇక తండ్రి ఆజ్ఞాపిస్తే చేయకపోవటమేమిటి ? ఇప్పుడే భరతుణ్ణి పిలిపించమంటాడు. ఎంత చక్కగా గ్రహించాడో చూడండి భరతుడి స్వభావాన్ని రాముడు. అతడంటే ఎంత ప్రాణాధికమైన ప్రీతో చూడండి.
కాని మానవులకే లేదీ ఉదారదృష్టి అందువల్లనే రాముడు తప్ప మిగతా వాళ్లంతా భరతుణ్ణి మొదటినుంచి అనుమానిస్తూనే వచ్చారు. అతడెంత స్థిరచిత్తుడో వాళ్ళంత చలచిత్తులు. అతడెంత స్తిమిత స్వభావుడో వాళ్లంత ఆవేశ స్వభావులు. ఎవరోగాదు వారు. సొంత తమ్ముడు లక్ష్మణుడు - అంతో ఇంతో తపస్సంపన్నుడైన భరద్వాజుడు ఏమీ తెలియని గుహుడూ అందరూ ఆయనను అనుమానించినవారే. రాముడికేదో కీడు చేయబోతాడని వారి భయం. రామాభిషేకం ఆగిపోయిందని తెలియగానే ఆపుకోలేని ఆవేశానికి గురి అయ్యాడు లక్ష్మణుడు. భరతుడు అతడి పక్షాన్నీ అందరినీ నిర్మూలిస్తానని లేచాడు. రాముడు చీవాట్లు పెట్టి అతణ్ణి సర్దవలసి వచ్చింది. మరలా అరణ్యానికి భరతుడు సైన్యంతో బయలుదేరి వస్తుంటే దూరం నుంచి చూచాడో లేదో కోపంతో ఊగిపోతాడు. హాయిగా రాజ్యం చేజిక్కుంచుకొని అది చాలక దుర్మార్గుడు మనమీది కెత్తి వస్తున్నారు. వీడివల్లనే మనకిన్ని కష్టాలు. సంప్రాప్తోయ మరిర్వీర - భరతోవధ్య ఏవమే. వీడు మనకు శత్రువు. వీణ్ణి చంపటమే మంచిది.
Page 211