దగ్గరికి తీసుకెళ్లాలని. పోతే దశరథుడికీ కూడా ఇష్టమే భరతుడంటే. మాతుల కులానికి వెళ్లినా భరత శత్రుఘ్నులను మనసులో ప్రతిక్షణమూ తలచుకొంటూనే ఉన్నాడట. వారు ఆయన ననుకొంటూనే ఉన్నారట. అసలు నలుగురు పుత్రులు ఆయనకు ప్రీతిపాత్రులే తేడాలేదు. ఎటు వచ్చీ తేషాంరామోరతికరః పితుః రాముడు ఎక్కువ ప్రీతిపాత్రుడు ఎందుకంత ప్రీతి అతడంటే. కవి ఇస్తున్నాడాయన తరుఫున మనకు జవాబు. సహిదేవైరుదీర్ణస్య రావణస్యవధార్థిబిః - అర్థితో మానుషేలోకే జజ్ఞేవిష్ణుస్సనాతనః అని అంతా ఆదినారాయణుడి మూర్తిగదా. ప్రీతి పాత్రుడెలా కాకపోతాడు.
పోతే భరతుడి కటు తండ్రి అన్నా ఇటు రాముడన్నా కూడా గొప్ప గౌరవము, భక్తి భావము, అసలు పెద్దలంటే భరతుడికి మొదటి నుంచి అవ్యాజమైన భక్తి. తాత ఐనా తండ్రి అయినా, తల్లులైనా అగ్రజుడైన అందరియెడల సమానంగా ఉన్నదా భావం. అది దశరథుడికి బాగా తెలుసు. రాముణ్ణి అభిషేకానికి ముందు రెండవమారు పిలిచి మాట్లాడినప్పుడే బయట పడుతుంది. కామంఖలు సతాంవృత్తే భ్రాతాతేభరతః స్థితః జ్యేష్ఠానువర్తీ ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః రామా నీ తమ్ముడు భరతుడు చాలా మంచివాడు. యోగ్యుడు. నాకు తెలుసు. పెద్దలంటే గౌరవం, ధర్మమార్గ తత్పరుడు. దయాదాక్షిణ్యాలున్నవాడు, గొప్ప నిగ్రహం కలవాడు కూడా. ఎటు వచ్చీ ఇన్ని మాటలు చెప్పి ముసలాయన చివరకన్న మాట చూస్తే మనకు చాలా చిత్రమనిపిస్తుంది. కింతుచిత్తం మనుష్యాణా-మనిత్యమితిమేమతిః అయినా చెప్పలేము మానవుల మనస్సు అతిచంచలమైనవి. ఎప్పుడెలా మారిపోతాయో అంటాడు. భరతుడంటే ఒక పక్క అభిమానము మరొకపక్క భయము ఆ తండ్రికి. కారణం రాముడి అభిషేకానికెక్కడ అతనివల్ల విఘ్నం కలుగుతుందోనని. దానికి కారణం అతని తాతగారికి తాను ముందుగా మాట ఇచ్చి ఉండటం. దీనికి భరతుడెలా బాధ్యుడవుతాడు. నిజానికి భరతుడే కర్మా ఎఱగడు. చేసినదంతా తాను. తన మనస్ససలు చంచలం. తన చిత్తచాంచల్యాన్ని భరతుడి కంటగడుతున్నాడు. తాను దొంగ అయితే పొరుగును నమ్మడట. పాపం భరతుడే ఇంకా స్థిరచిత్తుడు. నిష్కల్మషుడు. కనుకనే అంతా జరిగిన తరువాత కూడా తనకేదీ అక్కరలేదని రాముడి కోసం పరుగెత్తాడు. మరి ఇంకా ఏదీ జరగకముందే తండ్రి ఇలా భయపడుతున్నాడతని విషయంలో.
Page 210