#


Index

భరత లక్షణులు

తిరిగి ఆ నాలుగు మూర్తులూ సత్యస్థమే కావలసి ఉంది. రాముడి మాటల్లో ఎంత నిగూఢమైన అర్ధం దాగి ఉన్నదో చూడండి. ఇక్కడ ఇంకా ఒక గూఢమైన రహస్యాన్ని గ్రహించాలి మనం. చేష్టారూపమైన శక్తి ఇద్దరికీ కావాలి. అయోధ్యలో భరతుడికీ కావాలి. అరణ్యంలో రాముడికీ కావాలి. క్రియారూపమైన ఆ శక్తి ఒక్కటే అయినా ద్విధావిభక్తమై ఒకటి భరతుణ్ణి మరొకటి రాముణ్ణి ఆశ్రయించింది. శక్తిరూపంగా ఒక్కటనే భావానికి సూచనే లక్ష్మణ శత్రుఘ్నులిద్దరూ ఒక్కతల్లికి జన్మించిన కవల పిల్లలని కావ్యంలో వర్ణించటం. పోతే ఒక్కటే అయినా ఆ శక్తి విభక్తమై ఇద్దరినీ ఆశ్రయించిందనే భావానికి ద్యోతకమే కవలపిల్లలైనా వారు విడిపోయి ఒకరు భరతుణ్ణి మరొకరు రాముణ్ణి అంటిపెట్టుకొని ఉన్నట్టు పేర్కొనటం.

  ఇంతకూ తేలిందేమంటే భరతుడనే పాత్ర మనోభూమికకు కేవలమొక చిత్రీకరణమేనని. కనుకనే ఆ పాత్ర జీవితంలో మానవుడి మనస్తత్త్వానికి సంబంధించిన విరాడ్రూపమంతా మనకు సాక్షాత్కరిస్తుంది. మనస్సంటే అది ఒకటి గాదు. అందులో ఎన్నో భూమికలుంటాయి. తామస రాజస సాత్త్వికాలు. వాటిలో ఎన్నో అసంఖ్యాకమైన వృత్తులు. చిత్ర విచిత్రమైన అభిరుచులు. తజ్జన్యమైన అనుభూతులు. అందులో కొన్ని హేయం, కొన్ని ఉపాదేయం, కొన్ని ఉపేక్ష్యం ఇదంతా కలసి మనోరాజ్యం. ఈ రాజ్యాన్ని చివరదాక ఎంత సక్రమంగా పాలించాడు. పాలించి ఎంతటి ఘనవిజయాన్ని సాధించాడు భరతుడనే విషయమే ఇప్పుడు మనం ముడివిప్పి చూడవలసింది.

  భరతుడు కైకేయి గర్భవాసాన జన్మించిన ఏకైక పుత్రుడు. కైక అటు తల్లిదండ్రులకెంతో గారాబమైన బిడ్డ. ఎంత గారాబమంటే ఆవిడకు పుట్టిన బిడ్డనికి రాజ్యమిస్తేగాని నాబిడ్డనిచ్చి పెండ్లి చేయనని కట్టడ పెట్టాడామె తండ్రి యుధాజిత్తు. పోతే ఇటు భర్తకుకూడా అంత గారాబైనదే. ఎంత గారబమంటే ఆయనకు కౌసల్యలేదు. సుమిత్రలేదు. రాజనీతిలేదు, అన్నీ వదులుకొని అయినా ఆమె కోరికే తీర్చవలసి వచ్చిందా ముసలాయన. ఇలా పుట్టినింటికీ మెట్టినింటికీ ఇంత పోరాని చుట్టమైన ఆ తల్లికి పుట్టిన కుమారుడిక ఎంత గారాల కూన అయి ఉంటాడో చెప్పనక్కరలేదు. ఇరువురకూ అల్లారుముద్దైన వాడే. కనుకనే అట్లా పెండ్లి పీటల మీద నుంచి లేచారో లేదో అప్పుడే తయారయ్యాడు మేనమామ అశ్వపతి తాతగారి

Page 209

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు