పోతే రెండవ జత భరత శత్రుఘ్నులు. భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణావర జోహితః ప్రాణైః ప్రియతరోనిత్యం తస్యచాసీత్తథా ప్రియః - భరతుడికి కూడా శత్రుఘ్నడంటే చాలా ఇష్టం. ప్రాణం కంటే ఎక్కువేగాక ప్రియుడు, హితుడు కూడా. హితత్వమంటే మేలు చేయటం. ఏమిటామేలు. దుష్టులను శిక్షించటం, శిష్టులను రక్షించటం. ఇంతకన్నా మేలేమున్నది. కనుకనే వారొక జత అయితే వీరొక జత అయినారు. రాముడికక్కడ పనిచేసి పెట్టవలసినవాడు లక్ష్మణుడైతే భరతుడి కిక్కడ శత్రుఘ్నుడు. కేకయ దేశాధిపతి తన మాతామహుడిని చూడటానికి వెళ్లినప్పుడు కూడా శత్రుఘ్నుణ్ణి వెంటబెట్టుకొనే వెళ్లుతాడు భరతుడు. గచ్ఛతామాతులకులం– భరతేనమహాత్మనా-శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీతః ప్రీతి పురస్కృతః ఇక్కడ శత్రుఘ్నోనిత్యశత్రుఘ్నః అనే మాట గమనించవలసిన మాట. నిత్య అని విరవవచ్చు. అనిత్య అని విరవవచ్చు ఆ శబ్దాన్ని. విరిస్తే ఏమిటి ఫలితార్ధం. నిత్య శత్రువులనూ, అనిత్య శత్రువులను ఇద్దరినీ పరిమార్చేవాడని అర్ధం. నిత్యశత్రువులు కామక్రోధాదులు. వీరు మనలోపల దాగి ఉన్నారు. అనిత్య శత్రువులు రాజ్యానికి ద్రోహం తలపెట్టే దుండగులు. వారు మనకువెలపలే కనిపిస్తుంటారు. ఇరువర్గాలనూ మర్దించినవాడే రాజ ఋషి. ఆ రాజ ఋషి జటాధారి అయి రాజ్యం చేసిన భరతుడు.
అన్నదమ్ములు నలుగురిలో ఉండే ఈ అంతస్సూత్రాన్ని చక్కగా గుర్తించినవాడు ఆత్మారాముడైన రాముడే. అది ఆయన పదిమంది ఎదుటా భరతుడితో అన్న మాటలలోనే మనకు బయటపడుతుంది. భరతా నీవు అయోధ్యలో ఉండి రాజ్యం చేయి. నేనీ అరణ్యంలో ఉండి చేస్తుంటాను. నీకు పట్టణంలో శ్వేతచ్ఛత్రం పడితే నా కరణ్యంలో ఈ చెట్లే పడతాయి. అంతే కాదు. శత్రుఘ్నః కుశలమతిస్తుతే సహాయః శత్రుఘ్నుడక్కడ నీ పరిపాలనకు తోడ్పడితే సౌమిత్రిర్మమ విదితః ప్రధానమిత్రమ్ లక్ష్మణుడు నాకిక్కడ బాసటగా ఉంటాడు. మొత్తం మీద చత్వారస్తనయవరావయం నరేంద్రమ్ - సత్యస్థంభరతచరామ మావిషీద నలుగురు కుమారులమూ కలిసి తండ్రిగారికి నాలుగువిధాలుగా సేవచేస్తూ ఆయనను సత్యస్థుడనిపిద్దామంటాడు. సత్యస్థమైనది నిజంలో పరమాత్మే. పరమ సత్యమది. అదే నాలుగు విధాలుగా అవతరించిందీ ప్రపంచంలో. మనః ప్రాణచేష్టారూపంగా వ్యవహరించింది. ధర్మ సంస్థాపనం చేసింది. అలా చేయటమే చ రామ అనేమాట కర్ణం. చేసిన తరువాత
Page 208