#


Index

భరత లక్షణులు

అయోధ్యలోనే ఉందని వలపోసుకుంటాడు. కాని కేవలమొక మనస్సే అయితే అది ఆలోచనాత్మకమే గాని ఆచరణాత్మకం కాదు. ఆలోచన ఆచరణ Planning & Ex-ecution రెండూ కలిస్తే గాని రాజ్యపాలన సక్రమంగా కొనసాగదు. రామరాజ్య మనిపించుకోలేదు. కనుకనే ప్రాణరూపుడైన లక్ష్మణుణ్ణి తనవద్ద ఉంచుకొని శత్రుఘ్నుణ్ణి భరతుడి దగ్గర నిలిపాడు రాముడు. ప్రజలను కాపాడలంటే ప్రతీప శక్తులను కాపాడాలి గదా. ఆ ప్రతీప శక్తులే శత్రువులు. వారిని రూపుమాపటమే శత్రుఘ్నత. అది తనకు తోడ్పడుతుంటే రాజ్యాన్ని భరించగలిగాడు భరతుడు. భరించాడు గనుకనే అసలు భరతుడయ్యాడు. మొదట పరమాత్మ చైతన్య శక్తిని భరించాడు. అదే సదాలోచన. తరువాత తద్బలంతో శత్రు నిషూదనా రూపమైన ఆచరణ శక్తిని కూడా భరించాడు.

  అన్నదమ్ములలో భరతశత్రుఘ్నలిద్దరూ ఒక జత అయితే రామలక్ష్మణులిద్దరూ ఒక జత అయి మెలగటంలో ఇదే అంతరార్థం మొదటి నుంచి అలాగే వర్ణిస్తూ వచ్చాడు రామాయణ కవి తన గ్రంథంలో బాల్యాత్ప్రభృతిసుస్నిగ్ధా లక్ష్మణో లక్ష్మీవర్ధనః రామస్యలోకరామస్య బహిః ప్రాణ ఇవాపరః యదాహిహయమారుడో మృగయాంయాతి రాఘవః - తదైనం పృష్ఠతో భ్యేతి - సధనుః పరిపాలయన్ చిన్నప్పటి నుంచీ రాముడికి లక్ష్మణుడంటే ఎంతో ఇష్టం. తన బహిఃప్రాణంగా చూచుకొనే వాడతణ్ణి. రాముడు వేటకు వెళ్లితే చాలు. అతని వెంట ధనుఃపాణియై లక్ష్మణుడు కంటికి రెప్పలాగా కాపాడుతూ వెళ్లవలసిందే. చూడండి. ఇక్కడ లక్ష్మణుణ్ణి ప్రాణంతో పోల్చాడు మహర్షి. ఈ ఉపమానమే చెబుతుంది మనకు లక్ష్మణుడు ప్రాణానికి సంకేతమని. పాలయన్ననేమాట కూడా ఆ భావాన్నే సమర్థిస్తుంది. జీవుడు నిద్రించే సమయంలో కూడా తాను నిద్రించకుండా శరీరమనే కులాయాన్ని కాపాడేది ప్రాణవృత్తి ఒక్కటే గదా. కనుకనే అరణ్యవాసం చేసిన పదునాలుగేండ్లూ నిద్ర అనే మాట వదిలేసి రాత్రిందివమూ జాగరూకుడై సేవించాడు సీతారాములను లక్ష్మణుడని చెప్పటం. ఇదికూడా ఒక సంకేతమే లక్ష్మణుడు ప్రాణరూపుడని నిరూపించటానికి. అప్పుడతని నిద్రావృత్తి అంతా ఏమయింది. అదీ అతని అధీనంలోనే ఉంది. ఎక్కడ. అయోధ్యలో ఊర్మిళా రూపంగా. ఊర్మి అంటే నిద్రే. ఆధీనంలో ఉంది గనుక లక్ష్మణుడికి లాక్షణికంగా భార్యే ఆవిడ. చూడండి. కథా రహస్యం కూడా మనకెంతగా బోధపడుతుందో ఈ మాటలో.

Page 207

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు