#


Index

భరత లక్షణులు

  అసలు పాంచరాత్రులైన వైష్ణవులు చెప్పే సిద్ధాంతం చూచినా ఇది సరిపోతుంది. పాంచరాత్రులు విష్ణువుకు నాలుగు వ్యూహాలు వర్ణిస్తారు. వాసుదేవ వ్యూహం, ప్రద్యుమ్న వ్యూహం, సంకర్షణ వ్యూహం, అనిరుద్ధవ్యూహం. ఇందులో వాసుదేవ అనేది ప్రధానం. మిగతా మూడు దానినుంచి ఏర్పడ్డవే గనుక దాని కంగభూతం. వీటి నాధ్యాత్మికంగా వ్యాఖ్యానించటంలో వైష్ణవులు వాసుదేవ అంటే ఈశ్వరుడనీ, సంకర్షణుడంటే జీవుడనీ, ప్రద్యుమ్నమంటే మనస్సనీ అనిరుద్ధమంటే అహంకారమనీ అర్ధం చెబుతారు. కాని నామస్వారస్వాన్ని బట్టి మరొక మార్గంలో కూడా దీన్ని వ్యాఖ్యానించవచ్చు మనం. వసతి దివ్యతీతి వాసుదేవః సర్వత్రా వసిస్తూ ప్రకాశిస్తూ ఉన్న తత్త్వం పరమాత్మ. అదే రాముడిక్కడ. పోతే అనిరుద్ధమంటే నిరుద్ధంకానిది అడ్డు లేకుండా సాగుతుండేది ప్రాణం. అదే ఇక్కడ లక్ష్మణుడు. ఇక ప్రద్యుమ్నమంటే ఎక్కువ కాంతితో ప్రకాశించేది మనసు. అది భరతుడు. సంకర్షణ, శషయోరభేదః – కర్శనమే కర్షణం – కర్శనమంటే మర్దించటం. సమ్మంటే నిశ్శేషంగా. శత్రువర్గాన్ని నిశ్శేషంగా నిర్మూలించే అహంకార రూపమైన శక్తి. అదే శత్రుఘ్నుడు. వెరసి మనః ప్రాణతత్రియాశక్తి విశిష్టమైన ఏ పరమాత్మ చైతన్యముందో అదే శ్రీరామచంద్ర పరబ్రహ్మం. మనః ప్రాణాలు రెండూ దాని కుపాధులే. దాని అనుయాయులే. తదీయ ప్రభావంతో వర్తించవలసినవే.

  ఇందులో మనోరూపుడైన భరతుణ్ణి రాముడు తనకు మారుగా అయోధ్యలో నిలిపాడు. ఆలోచనాత్మకమైనది గదా మనస్సు అందుచేత అదే రాజ్యచక్రపాలన సాగించవలసి ఉంది. అంటే రాముడే అప్పటికి రాజ్యం చేశాడు వాస్తవంలో. భరతుడుకాదు. కాదని చెప్పటానికివేరే నిదర్శనమక్కరలేదు మనకు. భరతుడు తన కయాచితంగా రాజ్యం లభించినా పరిగ్రహించక అరణ్యానికి పయనమై పోయి రాముణ్ణి మరలా పట్టణానికి తీసుకుపోవటానికి ప్రయత్నించటంలోనే కనిపిస్తుంది. అతడు వినకపోతే పాదుకలైనా ఇమ్మని చెప్పి వాటిని తీసుకొనిపోయి సింహాసనం మీద ఉంచి వాటికి ప్రతినిధిగా తాను వర్తించటంలో ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. రామపాదుకా ప్రభావంతోనే రాజ్యపాలన జరిపాడంటే రాముడే గదా వాస్తవానికి రాజ్యం చేసినవాడు. అందుచేత భరతుడంటే మనస్సే. కనుకనే రాముడరణ్యంలో ఉన్నంతకాలము భరతుడెలా ఉన్నాడో నని అతణ్ణి స్మరిస్తూ నామనసంతా

Page 206

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు