#


Index

భరత లక్షణులు

కూడా అనిపిస్తుంది నాకు. చూడండి. రాముడు పరమాత్మ అనుకొంటే ఆయన తాను స్వయంగా రమిస్తూ ఈ జీవలోకాన్నంతా రమింపజేస్తున్నాడని భావం. మరి లక్ష్మణుడెవరు ? లక్ష్మణమంటే లక్షణం. అది కలవాడు లక్ష్మణుడు. పరమాత్మకున్న లక్షణమేమిటి. ప్రాణశక్తి. ఆయన చైతన్యరూపుడైతే ఆయన స్థితికి హేతువైనది ప్రాణం. కాబట్టి ఆయనలక్షణమే అది. పోతే ఇక భరతుడాయన సంకల్పరూపమైన మనశ్శక్తి అయితే శత్రుఘ్నుడాయన సర్వదుష్టశక్తి నిర్మూలనకారి అయిన ఐశ్వర్యశక్తి. సంకల్పాన్ని చైతన్యం భరిస్తుంది కాబట్టి అతడు భరతుడయ్యాడు. ఐశ్వర్యం శత్రువిదారణం చేస్తుంది కాబట్టి అతడు శతృఘ్నుడయ్యాడు. మరొక విధంగా చెబితే ఈ గుణాలే పరమాత్మ చేతిలోని దివ్యాయుధాలని కూడా అన్వయించుకోవచ్చు. విష్ణువు చేతిలోని సుదర్శనచక్రం చక్రాకారంగా భ్రమించే మనసుకు ప్రతీకం. అదే భరతుడు. పాంచజన్యమనే శంఖం ప్రాణానికి సంకేతం. పంచప్రాణాలే పంచజనులు. దానివల్ల ఏర్పడిందే పాంచజన్యం. అది ప్రాణశక్తి అయిన లక్ష్మణుడే. పోతే వాటివల్ల తాను ప్రదర్శించే శత్రుసంహారము, విజయోత్సాహమే శత్రుఘ్నుడంటే. అప్పటికంతా కలిపి చెబితే ఆత్మారాముడైన పరమాత్మ దశరథ రాముడుగా అవతరించి లక్ష్మణుడై భూమండలమంతా పరిభ్రమించి శతృఘ్నుడై దుష్టశిక్షణ గావించి భరతుడై శిష్టరక్షణ చేసి రాజ్యచక్రాన్ని అవక్రపరాక్రమంతో పాలించి అవతార ప్రయోజనం తీరగానే అవతారం చాలించి మరలా ఆత్మారాముడుగానే ప్రకాశించాడని అర్థం చేసుకోవాలి భావుకుడు.

  అఖండమైన ఈ రామతత్త్వాన్ని ఒక అద్భుతమైన ఉపమానంతో బయటపెట్టాడు మహర్షి. సర్వ ఏవతుతస్యేష్టా-శ్చత్వారః పురుషర్షభాః - స్వశరీరాద్వినిర్వృతా శ్చత్వార ఇవబాహవః దశరథుడి దృష్టికా నలుగురు కుమారులు ఎంత ఇష్టమంటే తన శరీరంనుంచి పుట్టుక వచ్చిన నాలుగు చేతులలాగా చూచుకొనేవాడట. చూడండి. ఇది ఎంత గంభీరమైన ఉపమానమో. చేతులు నాలుగుగా కనిపిస్తున్నా వాటికి మూలమైన శరీరమొక్కటే. అది దశరథుడి శరీరమంటే ఆ దశరథుడయోధ్యాధిపతే కానక్కర్లేదు. త్రిలోకాధిపతి మహావిష్ణువైనా దశరథుడే. దశావతారాల నెత్తిన వాడెవడో వాడు దశరథుడు. రథమనేది లక్షణార్థంలో శరీరమే అవుతుంది. దీన్ని బట్టి నలుగురూ ఒకే ఒక విష్ణుతత్త్వమని గూఢంగా సూచిస్తున్నాడు మహర్షి.

Page 205

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు