#


Index

భరత లక్షణులు

మానవేంద్రత్వమూ, మానవేంద్రత్వానికి మానవత్వమనే రంగు దట్టంగా పట్టించి మనకాయన హంగు చూపక ఇంకా ఖంగు తినిపిస్తున్నాడు మనలను. సామాన్య మానవుడిలాగా కోపతాపాలు చాటుమాటు మాటలూ, కామవ్యామోహము, వియోగవేదనా, మోసాలు, కుట్రలు, లాలూచీ వ్యవహారమూ, చేతగానితనమూ, అమాయికత్వము, అఘాయిత్యము, ఇలాంటి లక్షణాలన్నీ అడుగడుగునా ప్రదర్శించాడు జీవితంలో. అలాగే పౌరుషమూ, కీర్తికాంక్ష, వీరోచితంగా పోరాడటము, సాధుసంరక్షణ, ధర్మదీక్ష, సహాయ సముపార్జన, బలప్రదర్శనము, ప్రతిజ్ఞా నిర్వహణము, ప్రజాభి సమ్మతంగా నడచుకోవటము, ఇలాంటి మానవేంద్ర లక్షణాలు నిరూపించాడు. పోతే వీటన్నిటినీ మించి వీటన్నిటిలో దాగి వీటన్నింటిని నడిపే ఈశ్వరతత్త్వాన్ని ప్రదర్శించాడు చాటుమాటుగా అసలీశ్వరుడే మానవుడయి పుట్టి మానవుడుగా మానవేంద్రుడుగా వ్యవహరిస్తూ వచ్చాడు. కనుక మన మీ మానవుడుగా వ్యవహరించే మానవేంద్రుడిలో మరలా ఆ ఈశ్వర తత్త్వాన్నే దర్శించగలగాలి. దర్శించాలంటే దృశ్యాదృశ్యంగా సాగిన ఆ అవతార చమత్కారాన్ని బాగా విమర్శించి చూడాలి. అలా విమర్శించి దర్శించినప్పుడే కవి హృదయాన్ని గ్రహించి రామాయణ రామణీయకంలో మనం భాగస్వాములం కాగలము. రసజ్ఞులమేగాక తత్త్వజ్ఞులయి తరించగలము.

  మరి రామ పరివారంలోనే ఎందరో ఉన్నారు గదా చిన్న పెద్ద పాత్రలు. వారు నిరంతరమూ రాముడి చుట్టూ తిరుగుతూ రాముడితో తమ జీవితాలు ముడిపెట్టుకొని బ్రతికినవారు గదా. ఎవరెవరా రామతత్త్వాన్ని ఎంతవర కర్థం చేసుకొన్నారెలా సేవించారని చూస్తే మనకాశ్చర్యం వేస్తుంది. అతి మందుల దగ్గర నుంచీ ఉత్తమోత్తముల వరకూ ఎందరో ఉన్నారందులో అధికారులు. అందరిదీ ఒక దృష్టి కాదొక మార్గం కాదొక వ్యవహారం కాదు. సుతుడనుచు దశరథుడు, హితుడనుచు సుగ్రీవుడని రామదాసు సెలవిచ్చినట్టెవరి దృష్టితో వారు చూచారెవరి శక్తి కొలది వారు గ్రహించారెవరి మనసుకు తోచినట్టు వారు వ్యవహరించారాయనతో. అయినా బ్రహ్మేంద్రాదులకైనా నీ మాయ తెలియదని తెలిసినవాడు గనుకనే ఆయన మాత్రం ఎవరెవరు తన్ను ఎలా ఆశ్రయిస్తే వారినలాగే తాను అనుగ్రహిస్తూ వచ్చాడు. మమవర్త్మాను వర్తంతే అన్నట్టు ఏదో ఒక విధంగా అందరూ భగవన్మార్గంలో ఉన్నవారే

Page 202

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు