ఇది మనమే కాదు. ఆనాటి కాళిదాసాదులు కూడా సరిపుచ్చుకోలేక నందిమీద, పందిమీద పెట్టి మనసులోని అక్కసు వెళ్లగ్రక్కుతూ వచ్చారు. త్వాం ప్రత్యకస్మాత్కలుష ప్రవృతా - వస్త్యేవకోపో భరతాగ్రజేమే అని వాల్మీకి చేతనే అనిపించాడు కాళిదాసు. మరి భవభూతి అయితే రాముడు చేసిన పనికి రాముడుచేతనే చిందులు ద్రొక్కించాడు చివరదాకా. ఇదంతా ఒక ధర్మ సూక్ష్మం గ్రహించలేక మనం పడుతూ ఉన్న మధనేగాని మరేది గాదు. ఆ సూక్ష్మమేమంటే సాహిత్యమంతా ఒకానొక సత్యానికి కేవలం సంకేతమే. సత్యాన్ని ఆవిష్కరించటానికే సంకేతాన్ని ఆశ్రయిస్తాడు కవి. మనమీ సంకేతల ద్వారా ఆ సత్యాన్ని అందుకోవాలని బాగుపడాలని కవి ఉద్దేశం. మనమేమి చేస్తున్నాము. సత్యాన్ని విడిచిపెట్టి సంకేతానికి ప్రాధాన్యమిస్తున్నాము. దానివల్ల వచ్చింది ప్రమాదమంతా. సంకేతమేమిటి. కథ ఒక సంకేతం. పాత్రలొక సంకేతం. వారి ఆలోచనలు, మాటలు, చేష్టలు ఒక సంకేతం. అవి సత్యం కావు. అయితే రామాయణ కథే అసలు జరగలేదా ? అని మరలా ఉలిక్కిపడరాదు. ఏ కొంచెమో జరిగి ఉండవచ్చు. జరిగింది కొంచెమైతే కొండంత కల్పనచేశాడు వాల్మీకి. అంతా జరగనూ లేదు. అసలు జరగకనూ పోలేదు. రెండింటి మిశ్రణం ఇతిహాసం. కాబట్టి సీతను రాముడు పరిత్యజించాడనే చెప్పనక్కరలేదు. ఒకవేళ సాక్షాత్తుగా పరిత్యజించాడే ననుకొన్నా భయంలేదు. లౌకికంగా జరిగిందనిచెప్పినా *అదీ ఒక సంకేతమే. ప్రపంచమంతా ఒకే సంకేతమనే గదా వేదాంతుల తీర్మానం. అలాంటప్పుడు కావ్యంలో జరగితేనేమి. లోకంలో జరిగితేనేమి. దాన్ని గాదు మనం పట్టుకొని వ్రేలాడవలసింది.
అయితే మరేమిటంటారు. జరిగినా కవికల్పించినా అసలీ సన్నివేశంలోని అంతరార్ధమేమా ? అది మనకు అందజేసే సందేశమేమా అని. అదీ ఈ సంకేతము ద్వారా గ్రహించవలసిన సత్యం. ప్రస్తుతమా సత్యమేమిటిక్కడ. రాజైన వాడు ప్రజానురంజకంగా పాలనం చేయాలని, ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని, ప్రజలు తన విషయంలో అసంతృప్తి పొందినా అపవాదం వేసినా దానికి సమాధానం చెప్పి తీరాలని, ప్రజాకార్య నిర్వహణలో స్వార్ధానికి చోటులేదనీ అవసరమైతే వ్యక్తిగత సుఖాన్నైనా వదులుకోవటానికి వెనుదీయరాదని అప్పుడే రాజశబ్దమతనికి సార్ధకమవుతుందనీ ఇలాంటి గొప్ప ఆదర్శాలన్నిటికీ అది ఒక ప్రతీక. ఒక ఉదాహరణ
Page 196