సుగ్రీవాదుల ముందే పడవేసింది. అంటే రాముడెప్పటికైనా రావలసిందీ సఖ్యం చేయవలసిందీ సుగ్రీవుడితోనే వాలితో గాదని చెప్పినట్టయింది. అదే దైవ నిర్ణయం. దైవ నిర్ణయ మేమిటింతకూ. రావణ సంహారం. దానికోసమే రామావతారం. ఆయనకు తోడ్పడవలసినవారెవరు. వాలి సుగ్రీవులుగా అవతరించిన దేవతలే. అది విస్మరించిన వాడెవడిప్పుడు వాలి; అందుకే వాడి విషయం చెప్పలేదు కబంధుడు. అమ్మవారు సొమ్ములక్కడ న్యాసముంచలేదు. రామకార్యార్థ మెదురు తెన్నులు చూచే సుగ్రీవుడు అందులకు పాత్రుడు. అందుకే అతనితో మైత్రిచేసి వాలిని వధించాడు రాముడు. ఇది అన్ని ఆక్షేపణలకు ఆంతర్యంలో ఇవ్వవలసిన ఆఖరి సమాధానం. తస్మాదనతి శంకనీయోయమ్ వ్యవహారం.
పోతే రాముడు సీతను పరిత్యజించటం ఎంతవరకు సమర్ధనీయమనేది మరొక ఆక్షేపణ. వాలి వధ పరకీయమైతే ఇది స్వకీయమైన సమస్య. సీత తనకు సహధర్మచారిణే కావచ్చు. ఆవిడ మీద తనకెంత అధికారమున్నా ఉండవచ్చు. కాని ధర్మ మార్గంలో తాను నడుస్తూ లోకాన్ని నడపవలసిన వాడు చేయవలసిన కార్యమా ఇది. నిజంగా అపరాధిని అయితే శిక్షించవచ్చు. ఆవిడ చేసిన అపరాధమేమిటి ఇందులో. రాక్షసుని బారినుండుట మపరాధం కాదుగదా ! ఆవిడది కాకపోయినా పరోక్షంలో వాడేదో దురుసుగా ప్రవర్తించి ఉంటాడనటానికి బలవంతంగా ప్రవర్తిస్తే తల వేయి ప్రక్కలవుతుందని శాపమే ఉంది గదా వాడికి. అందుకే గదా వాడొక సంవత్సరం తన ఆధీనంలో ఉన్నా ఆవిడనేమీ చేయలేకపోయింది. పోనీ అది ఎవడు నమ్మాడంటే లంకలోనే రాక్షస వానరులందరి సమక్షంలో ఆవిడ నిష్కల్మషత్వం ఋజువయింది గదా ! అలాంటప్పుడయోధ్యలో ఎవరో కొందరు పామరులన్న మాటను పాటిగా తీసుకొని నిండుచూలాలని కూడా చూడక ఆవిడను పరిత్యజించటమా ? ప్రజల కోసమంటావా ? ఆవిడ మంచిదనే ప్రజలు కూడా ఉన్నారు గదా ! వీరికోసం వదులుకోకపోతే వారి కోసమేలుకోరాదా ? ఒక్కడన్నా అది మాటే గదా అంటావా ? అలాగైతే ఎవడో ఒకడు కావాలని ఎప్పుడొక అభాండం వేసినా వేయవచ్చు. ఎంత మంది కెన్ని మార్లని నీవు జవాబు చెప్పగలవు. భార్యమీద గాక తల్లిమీదనే అపవాదం వేస్తే ఏమి చేయగలవు. అపవాదానికి పరిత్యాగమే పరిష్కారమైతే అన్నిటినీ పరిత్యజించి మానవుడిక బికారి అయిపోవలసిందే. కాబట్టి సీతా పరిత్యాగ మేవిధంగా చూచినా సమర్ధనీయం కాదని ఆక్షేపణ.
Page 195