ఉంటాడు. చూచి చూచి ఎప్పుడు దెబ్బ తీయాలో అప్పుడు తీస్తాడు. అది ఎలా తీస్తాడో ఏ ప్రాణికీ అంతుపట్టదు. ఇది ఆ వానర జీవుడి మనసుకు తేవటానికే అజ్ఞాతంగా దైవహస్తమొకటి పని చేస్తుందని హెచ్చరించటానికే ఈ చెట్టు చాటు బాణప్రయోగనాటకం.
మరి సుగ్రీవుడికి మాట ఇచ్చాను కాపాడుతానని అనటం దేనికి. ఆ మాట వాలికే ఇచ్చి అతనితో సఖ్యం చేయవచ్చును గదా. దీనికి రెండు జవాబులు చెప్పవచ్చు మనం. ఒకటి రాజనీతి. మరొకటి దండనీతి. వాలి అసహాయ శూరుడు. అంత బలవంతుడైనా అతని దగ్గర సహాయ సంపదలేదు. హనుమజ్జాం బవదాది మహావీరులంతా సుగ్రీవుడి దగ్గరే ఉన్నారు. అతణ్ణి ఆశ్రయిస్తే వారందరూ కలిసి తనకు బాసటగా ఉంటారు. సీతాన్వేషణకు పనికి వస్తారు. పైగా సుగ్రీవుడికి భూమి నాలుగు దిక్కులూ తిరిగిన అనుభవమున్నది. ఎక్కడెక్కడి వర్తమానము సేకరించగలడు. వాలితోనే మైత్రి చేస్తే సహజంగా బలవంతుడైన వాలి మరీ బలవంతుడై పోతాడు. అతడివల్ల తన కార్యం సానుకూలమైనా ఎప్పటికైనా తనకే అతడు ముప్పు తెచ్చి పెట్టవచ్చు. పైగా జయమతనిదే అవుతుంది గాని తనది గాదు. దానివల్ల లోకంలో గౌరవంలేదు తనకు సుగ్రీవుడితోనే అయితే తద్ద్వారా బలవంతుణ్ణి రూపుమాపవచ్చు. బలహీనుడి కుపకారం చేసినపట్టు అవుతుంది. అలాంటివాడెప్పుడూ తన్ను మించిపోలేడు. మీదు మిక్కిలి తన కార్యము ఫలిస్తుంది. ఇది రాజనీతి.
పోతే సన్మార్గుణ్ణి కాపాడటమూ, దుర్మార్గుణ్ణి శిక్షించటమూ, దండనీతి లక్షణం. సుగ్రీవుడితో మైత్రి చేస్తేనే దాని కనుగుణంగా నడచుకొన్నట్టవుతుంది. లేకుంటే ఇన్ని ధర్మపన్నాలు వల్లించిన తానే అధర్మపరుడని చెడ్డపేరు తెచ్చుకొన్న వాడవుతాడు రాముడు. ఇది ఇక్కడ మనం చెప్పుకోవలసిన సమాధానం.
పోతే ఇంతకన్నా ఒక పెద్ద సమాధానమున్నది. అది ఒక దైవ రహస్యం. వాల్మీకి దాన్ని తన కావ్యారంభంలోనే కొంత సూచన చేసి ఉన్నాడు. అదేమిటంటే అసలీ వాలిగాని, సుగ్రీవుడుగాని ఎవరు వీరు. నిజంగా వానరులా ? కారు వానర రూపాలలో అవతరించిన దేవతలు. ఇంద్రాంశలో అవతరించినవాడు వాలి. సూర్యాంశలో పుట్టినవాడు సుగ్రీవుడు. ఎందుకిలా జన్మించారు. రామకార్యార్థమని
Page 193