కవి మాహాత్మ్యము
ఒక కావ్యాన్ని సమీక్షించేముందు దాన్ని రచించిన కవి జీవితము-అతని విశేషమూ-సాకల్యంగా తెలుసుకోవటం చాలా ఆవశ్యకం. ఎందుకంటే కవి మనస్తత్వాన్ని అనుసరించే అతని కావ్యనిర్మాణం జరుగుతుంది. యథాస్మై రోచతే విశ్వమ్-తథేదమ్ పరివర్తతే అని ఇంతకుముందే పేర్కొన్నాము. శృంగారీచేత్కవిః కావ్యే జాతమ్ రసమయమ్ జగత్తని కూడా చెప్పారాలంకారికులు. కవి శృంగారి అయితే కావ్యమంతా శృంగారమయం. శాంతుడైతే శాంతిమయం. ప్రస్తుతమీ రామాయణ కవి శృంగారికాడు. కారుణికుడూ కాడు. శాంతుడూ కాడు. అన్ని రసభావాలకూ అతీతుడై అన్నిటినీ అనుభవించినట్టు కనిపించే మహర్షి మహాకవి. మహాకవి అనే మాటలో మహచ్ఛబ్దంవల్ల ఋషిత్వమూ - కవిశబ్దంవల్ల కర్తృత్వమూ రెండూ ధ్వనిస్తుంటాయి. ఇలాంటి ఋషులూ కవులూ అయిన మహానుభావులెందరో లేరు. ద్విత్రాఃపంచషావా మహాకవయ ఇతిగణ్యంతే అని ఆనందవర్ధనులు చెప్పినట్టు వారు వ్యాసవాల్మీకి ప్రభృతులే ఒకరిద్దరో.
మనకు పద్దెనిమిది పురాణాలూ రెండు ఇతిహాసాలూ ఉన్నాయి. అందులో పద్దెనిమిది పురాణాలూ - ఇతిహాసాల్లో ఒకటైన భారతమూ ఈ పందొమ్మిది వ్యాస భగవానుడు రచిస్తే రామాయణమనే ఇతిహాసమొక్కటే వాల్మీకి రచించాడు. ఈ వ్యాస వాల్మీకులిద్దరే మహర్షులూ మహాకవులూ మనకు. వ్యాసునికే బాదరాయణుడని మరొకపేరు. ఇవి వీరిపేర్లయిందీ తెలియదు. బిరుదులయిందీ తెలియదు. చూడబోతే మొదట లాక్షణికంగా ఏర్పడి తరువాత రూఢమైన నామధేయాలుగా కనిపిస్తాయి. వ్యాస సమాస ఇవి రెండూ ప్రతిద్వంద్వి అయిన పదాలు. ఒకటి సంగ్రహించి చెబితే సమాసం. అదే విస్తరించి చెబితే వ్యాసం అలా
Page 19