చేయనక్కరలేదు. అది ఆ మహర్షి స్వయంగా భావన చేసి ఏదో ఒక సదుద్దేశంతో రచించి మనకందించి పోయిన గ్రంథం. ఆయన విలక్షణమైన దృష్టికది ఒక అక్షరాత్మకమైన సృష్టి. ఈ సృష్టి నామూలాగ్రము పరిశీలించి ఇందులో దాగి ఉన్న ఆ దృష్టి ఏమిటో ఎలాంటిదో అది మనకేమి బోధిస్తుందో ఎంత చక్కగా బోధిస్తుందో చేతనైతే అరసి పట్టుకోవటమే సహృదయులుగా మన మనుసరించవలసిన మార్గం. అది కూడా కేవల భౌతికస్థాయిలోనే అయితే మరలా ప్రయోజనం లేదు. భౌతికమైన స్థాయిలో ఒక సౌందర్యమైతే దాని కాంతరమైన ధార్మిక స్థాయిలో మరొక సౌందర్యమైతే, ఈ రెండింటినీ కావ్య తాత్పర్యమైన తాత్త్విక స్థాయికి ముడిపెట్టటం అన్నిటికన్నా అద్భుతమైన సౌందర్యం మహర్షి ప్రదర్శించింది. తద్వారా ఒక భూమికలో తల ఎత్తే సమస్యలకు మరొక భూమికలో సమాధానాలిస్తూ ఒక లోకోత్తర సార్వజనీన సందేశాన్ని లోకాని కందజేయట మనన్యా దృశమైన సౌందర్యం.
ఇలాంటి త్రిపథగా రూపమైన రామాయణ రామణీయకాన్ని అంతటిని ఆకళించుకొని చేసిన సమీక్షే నిజమైన సమీక్ష ఇదుగో ఇలాంటి సమీక్షా మార్గంలోనే పయనించి మహర్షి కావ్యంలోని మార్మికములైన భావాలేమిటో ఎలాంటివో బహుకాలం నుంచీ భావన చేసి శాఖలుగా సాగిన ఆ భావనా వృక్షఫలంగా నేనీ సమీక్షా గ్రంథాన్ని మీ ముందు పెడుతున్నాను. మరి దీని సారా సార విచారణ సారజ్ఞులైన మీకే వదలిపెడుతున్నాను. సారమంతా నా జ్ఞాన జన్యమైతే అసారమంతా నా అజ్ఞాన కృతమే. అంతేగాని ఆ మహర్షి మాత్రం రెంటికీ అతీతుడు. ఇక సెలవు.
Page 18